కృష్ణంరాజు సంస్మరణ సభలో ప్రవర్తించేది ఇలాగేనా?

September 29, 2022
img

నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరులో ప్రముఖ నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రభాస్‌ హాజరయ్యారు. దాదాపు 12 ఏళ్ళ తర్వాత  ప్రభాస్‌ మొగల్తూరు రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు వేలాదిమందిగా తరలివచ్చారు. వారిలో కొందరు ఆనందం పట్టలేక కేకలు, ఈలలు వేయగా, మరికొందరు పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వారు ప్రవర్తించిన తీరు చూస్తే వారు కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొనేందుకు వచ్చారా లేక ప్రభాస్‌ సినిమా రిలీజ్ అవుతోందన్నట్లు చూసేందుకు వచ్చారా?అనే సందేహం కలుగుతుంది. 

ప్రభాస్‌ వారిని ఉద్దేశ్యించి ఏదో మాట్లాడబోతే వినిపించుకోకుండా ఈలలు, కేకలు వేస్తూ రచ్చరచ్చ చేశారు. ఇక చేసేదేమీ లేక ‘అందరూ భోజనాలు చేసి వెళ్ళండి...’ అని ప్రభాస్‌ చేతితో సైగలు చేసి వెళ్ళిపోయారు. సంస్మరణ సభలో ఏపీ మంత్రులు ఆర్‌కె. రోజా, వేణుగోపాల్ కృష్ణ, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినవారందరికీ ప్రభాస్‌ భోజనాలు ఏర్పాటు చేశారు. సుమారు లక్ష మందికి సరిపడేవిదంగా భోజనాలు సిద్దం చేయించినట్లు సమాచారం. 

ఇంతకీ ఈ అభిమానులు, రాజకీయ నాయకుల హడావుడిలో చనిపోయిన కృష్ణంరాజును ఎవరైనా తలుచుకొన్నారో లేదో? విషాదకరమైన సంస్మరణ సభలో ప్రభాస్‌ అభిమానులు ప్రవర్తించిన తీరు మాత్రం సరిగా లేదనే చెప్పాలి.

 


Related Post