సూర్యాపేటలో వృద్ధురాలి హత్య: హంతకులు కోతుల గుంపు

September 27, 2022
img

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (సిఎం జగన్మోహన్ రెడ్డి) మండలంలోని పాత సూర్యాపేటలో ఓ వృద్ధురాలు దారుణహత్యకు గురయింది. అయితే ఆమెను హత్య చేసింది మనుషులు కారు... ఓ కోతుల గుంపు! ఆ వృద్ధురాలికి పక్షవాతం రావడంతో గత కొంతకాలంగా ఇంట్లో మంచాన్న పడింది. సోమవారం సాయంత్రం ఆమె ఇంట్లోకి కోతుల గుంపు ప్రవేశించి ఇంట్లో వస్తువులను చిందరవందర చేశాయి. మంచంలో ఉన్న ఆమె కదలలేక పక్కనే ఉన్న చేతికర్రతో వాటిని అదిలించబోతే అవి ఆమెపై దాడి చేసి పారిపోయాయి. 

వాటి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధురాలు తీవ్ర రక్తస్రావం అవుతున్నా మంచంలో నుంచి కదలలేని పరిస్థితిలో ఉండటంతో చుట్టుపక్కల వారికి ఈ విషయం తెలియలేదు. కొంతసేపు తర్వాత వృద్ధురాలి కొడుకు వచ్చి చూస్తే ఆమె నిర్జీవంగా పడి ఉంది. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో మొదట అది దొంగల పని అయ్యుండవచ్చని అనుమానించాడు. కానీ తల్లి ఒంటిపై పళ్ల గాట్లు చూసిన తర్వాత ఆమెపై కోతులు దాడిచేసినట్లు గ్రహించాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది. 

కోతులు మనుషులపై దాడి చేయడం సాధారణ విషయమే కానీ వాటి దాడిలో ఓ మనిషి ప్రాణం కోల్పోవడం ఇదే మొదటిసారి. గ్రామంలో కోతులు ఇళ్లలోకి జొరబడి విధ్వంసం సృష్టిస్తున్నాయని, నిన్న జరిగిన ఈ ఘటన వాటికి పరాకాష్ట అని గ్రామస్తులు చెపుతున్నారు. కనుక పోలీసులు, అటవీశాఖ అధికారులు తమ గ్రామానికి ఈ కోతుల బెడదను వదిలించాలని పాత సూర్యాపేట గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Post