హైదరాబాద్‌ మెట్రోలో సజీవమైన గుండె తరలింపు

September 27, 2022
img

మొన్న ఆదివారం హైదరాబాద్‌ మెట్రో చరిత్రలో మరో గొప్ప అధ్యాయం లిఖించబడింది. ఆ రోజు సాయంత్రం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్ జరగడంతో మెట్రో విపరీతమైన రద్దీగా ఉంది. ఆరోజు రాత్రి ఒంటిగంటవరకు ప్రత్యేక సర్వీసులు నడిపారు. అయితే అదే రోజు రాత్రి జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో ఓ హృద్రోగికి అత్యవసరంగా గుండెమార్పిడి చికిత్స జరుగవలసి ఉంది. 

నాగోల్ సమీపంలో ఓ హాస్పిటల్‌లో ఓ బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి సేకరించిన సజీవమైన గుండె ఉంది. అంత దూరం అంబులెన్సులో గుండెను జూబ్లీహిల్స్‌ చేర్చలంటే ఎంత గ్రీన్ చానల్ ఏర్పాటు చేసినా చాలా సమయమే పడుతుంది. కనుక హాస్పిటల్‌ యాజమాన్యం నగర ట్రాఫిక్ పోలీసులను సంప్రదించగా వారు మెట్రో రైలులో అయితే త్వరగా, సులువుగా, సురక్షితంగా తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు. గుండె తరలింపుకు హైదరాబాద్‌ మెట్రో అధికారులు కూడా అంగీకరించి ఆదివారం రాత్రి ఒంటి గంటకు నాగోల్ నుంచి ఎల్బీ నగర్‌కు ప్రత్యేకంగా మెట్రో రైల్ సిద్దం చేశారు. 

నాగోల్ హాస్పిటల్‌ నుంచి మెట్రో స్టేషన్ వరకు అలాగే జూబ్లీహిల్స్‌ మెట్రో స్టేషన్ నుంచి అపోలో హాస్పిటల్‌ వరకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. రాత్రి ఒంటి గంటకు బాక్సులో భద్రపరచబడిన సజీవమైన గుండెతో వైద్య బృందం నాగోల్ మెట్రో స్టేషన్‌ చేరుకోగానే, వారి కోసం సిద్దంగా ఉంచిన మెట్రో రైలు మద్యలో ఎక్కడ ఆగకుండా వేగంగా దూసుకుపోయి కేవలం 25 నిమిషాలలో జూబ్లీహిల్స్‌ మెట్రో స్టేషన్ చేరుకొంది. 

అక్కడ సిద్దంగా ఉన్న అంబులెన్సులో గుండెను అపోలో హాస్పిటల్‌కి చేర్చడం, అప్పటికే హాస్పిటల్‌లో గుండె మార్పిడి ఆపరేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకొన్న వైద్య బృందం వెంటనే ఆ గుండెను రోగికి విజయవంతంగా అమర్చడం జరిగిపోయింది. ఇటువంటి ఓ మంచిపనికి ముందుకు వచ్చి సహకరించినందుకు వైద్యులు, రోగి బంధువులు, ట్రాఫిక్ పోలీసులు, ప్రజలు కూడా హైదరాబాద్‌ మెట్రో అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నారు. 


Related Post