తెలంగాణలో ఘనంగా సాగుతున్న బతుకమ్మ వేడుకలు

September 26, 2022
img

తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మతో నిన్న ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ పండుగలో రెండో రోజైన నేడు అటుకుల బతుకమ్మను మహిళలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి వరుసగా ముద్దపప్పు బతుకమ్మ, నానాబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ చివరి రోజు అక్టోబర్ 5వ తేదీ (విజయదశమి)న సద్దుల బతుకమ్మను నదులు, చెరువులలో నిమజ్జనంతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది. 

తొలిరోజున బతకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని ఎందుకు అంటారనే సందేహం చాలా మందికి ఉంది. దానికి రెండు కారణాలున్నాయి. 

1. బతుకమ్మని పేర్చేందుకు బంతి, మందార, జాజి, సంపెంగ, చామంతి, గన్నేరు, తామర, కలువ, తంగేడు, తదితర పూలను ముందురోజునే సేకరిస్తారు. అవి అప్పటికప్పుడు కోసి తెచ్చినవి కావు. ఒకరోజు ముందే కోసి తెస్తారు కనుక అవి ఎంగిలి పూలనే భావనతో ఆవిదంగా పిలుస్తారు. వాటిలో కొన్ని రకాల పూలు విచ్చుకొనేలా చేసేందుకు మహిళలు నోటితో ఊదుతారు. ఇదీ ఓ కారణమే.   

2. తొలిరోజున పెత్ర మాసం లేదా మహాలయ పితృపక్షాల సందర్భంగా చనిపోయిన పెద్దలకు పిండివంటలు నైవేద్యం చేసి వాటిని ఎంగిలి పడి (తిన్న) తర్వాత మహిళలు బతుకమ్మలను పేర్చడం ప్రారంభిస్తారు. కనుక ఈ పేరు వచ్చింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి అధికారికంగా నిర్వహిస్తోంది. బతుకమ్మ పండుగ ముగింపు రోజున ఏటా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది. కరోనా కారణంగా గత రెండేళ్ళు ఉత్సవాలు నిర్వహించలేకపోవడంతో ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Related Post