మెగా అభిమానికి మెగాస్టార్ భరోసా

August 09, 2022
img

మెగాస్టార్ చిరంజీవి స్వగ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు అని అందరికీ తెలిసిందే. మొగల్తూరులో గోడావారిపేటకు చెందిన కొయ్య నాగరాజు అనే వ్యక్తి చిరంజీవి వీరాభిమాని. ఆయన చాలా పేదవాడైనప్పటికీ చిరంజీవి పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 

కొంతకాలం క్రితం ఆయనకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక వైద్య పరీక్షల కొరకు అప్పుడప్పుడు హైదరాబాద్‌ వెళ్ళి వస్తుంటానని, వీలైతే ఓసారి చిరంజీవిని కలిసి తన బాధలు చెప్పుకోవాలని అనుకొన్నానని నాగరాజు తెలిపారు. కానీ ఎంత అభిమాని అయినా చిరంజీవి అంతటి వ్యక్తి తనవంటి వారిని కలుస్తారా? అని అనుమాన పడుతుండేవాడినని చెప్పారు. 

అయితే మొగల్తూరులో స్థానిక చిరంజీవి అభిమాన సంఘం నేతలు జిల్లా అభిమాన సంఘం నేతల చెవిలో ఈవిషయం వేయడంతో వారు చిరంజీవితో మాట్లాడారని నాగరాజు తెలిపారు. చిరంజీవి వెంటనే స్పందించి తమ దంపతులను హైదరాబాద్‌కు వచ్చి తనను కలవమని కోరారని నాగరాజు చెప్పారు. 

తాము హైదరాబాద్‌ వెళ్ళి చిరంజీవి పక్కన కూర్చొని సుమారు గంటన్నరసేపు మాట్లాడామని, ఆయన చాలా ఓపికగా అన్నీ విని తమకు ఆర్ధికసాయం అందించడమే కాక తమకు బట్టలు పెట్టి పంపించారని నాగరాజు చాలా సంతోషంతో పొంగిపోతూ చెప్పారు. తన కిడ్నీ వ్యాధికయ్యే ఖర్చు మొత్తం తానే భరించి చికిత్స చేయిస్తానని చిరంజీవి హామీ ఇచ్చారని నాగరాజు చెప్పారు. 

చిరంజీవిని కలిసిన తర్వాత మళ్ళీ తనలో జీవితం మీద ఆశ కలిగిందని నాగరాజు చెప్పారు. చిరంజీవి గురించి తాను ఎప్పుడూ వినడమే కానీ ఎప్పుడూ ప్రత్యక్షంగా కలవలేదని, ఇన్నాళ్ళకు ఇంత గొప్ప అవకాశం కలిగిందని నాగరాజు చాలా సంతోషంతో ఉప్పొంగిపోతూ చెప్పారు. తమకు చిరంజీవిని కలిసే భాగ్యం కల్పించిన చిరంజీవి అభిమాన సంఘాల నేతలకు నాగరాజు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

Related Post