తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ములు ఆత్మహత్యలు

June 23, 2022
img

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రాంపల్లి దాయర గ్రామంలో తల్లి మరణాన్ని తట్టుకోలేక ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకొన్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, రాంపల్లి దాయరకు చెందిన మెట్టు శ్రీనివాస్ రెడ్డి, ప్రమీల దంపతులకు మాధవ్ రెడ్డి, యాదిరెడ్డి, మహిపాల్ రెడ్డి ముగ్గురు కుమారులున్నారు. 

వారిలో యాదిరెడ్డి (34), మహిపాల్ రెడ్డి (29) హైటెక్ సిటీ వద్ద నివాసం ఉంటూ దిల్‌సుక్‌నగర్‌లో ఓ సంగీత కళాశాలలో పియానో టీచర్లుగా పనిచేస్తున్నారు. సుమారు 8 నెలల క్రితం వారి తల్లి ప్రమీల క్యాన్సర్ వ్యాధితో మరణించింది. ఆ తరువాత కొన్ని రోజులకు వారి తండ్రి శ్రీనివాస్ రెడ్డి మరో మహిళను వివాహం చేసుకొని వెళ్ళిపోయాడు. తల్లి మరణంతో చాలా క్రుంగిపోయున్న అన్నదమ్ములిద్దరికీ తండ్రి కూడా తమను విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.   

నిన్న (మంగళవారం) ఉదయం అన్నదమ్ములు ఇద్దరూ స్వగ్రామానికి వెళ్ళి గ్రామంలో స్నేహితులు, బంధుమిత్రులు అందరినీ కలిసి మాట్లాడారు. తరువాత ఇద్దరూ తమ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొన్నారు. యాదిరెడ్డి ఫ్యానుకు ఉరివేసుకోగా, తమ్ముడు మహిపాల్ రెడ్డి పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. 

వారి అన్న మాధవ్ రెడ్డి ఫోన్‌ చేస్తే ఇద్దరూ ఫోన్‌ ఎత్తకపోవడంతో అనుమానం కలిగి పొరుగింటివారికి ఫోన్‌ చేసి తన తమ్ముళ్ళు ఇంట్లో ఉన్నారేమో చూడాలని కోరారు. వారు కిటికీలో నుంచి చూడగా యాదిరెడ్డి ఫ్యానుకు ఉరి వేసుకొని కనిపించాడు. వారు మాధవ్ రెడ్డికి ఈ విషయం తెలియజేయగా ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడకు చేరుకొన్నారు. 

పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్ళి చూడగా అన్నదమ్ములిద్దరూ అప్పటికే మృతి చెందారు. వారు ఓ సూసైడ్ నోట్ వ్రాశారు. తల్లి మరణంతో తాము అనాధలమయ్యామని, ఆ బాధను తట్టుకోలేకనే ఇద్దరం ఆత్మహత్య చేసుకొంటున్నామని వ్రాశారు. 

Related Post