చీపురు పట్టి ఆలయాన్ని ఊడ్చిన కాబోయే రాష్ట్రపతి ముర్ము

June 22, 2022
img

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న ద్రౌపది ముర్ము ఎన్నిక లాంచనప్రాయమే కనుక కేంద్రప్రభుత్వం ఆమెకు అప్పుడే జెడ్ ప్లస్ భద్రత కల్పించింది. అయితే తాను ఝార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ అని కానీ కాబోయే రాష్ట్రపతిననే గర్వం ఏ కోశాన్నా ఆమెలో కనబడలేదు.

ఆమె తన స్వరాష్ట్రం ఒడిశాలోని గతంలో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మయూర్ భంజ్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు అక్కడ రాయ్‌రంగ్‌పూర్‌లో ఆమె తరచుగా సందర్శించే శివాలయానికి ఈరోజు ఉదయం వెళ్ళారు.

రాష్ట్రపతి అభ్యర్ధిగా తన పేరు ఖరారు చేయడంతో దైవదర్శనం చేసుకోవాలని ఆమె తనకు అత్యంత ఇష్టమైన శివాలయానికి వెళ్ళారు. అయితే ఆమె ఆలయంలో ప్రవేశించేముందు ఆమె పూజారి అందించిన చీపురు కట్ట అందుకొని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రంగా తుడిచారు. తరువాత ఆలయంలోకి వెళ్ళి పూజ చేసుకొన్నారు.

ఆమె నిరాడంబరత చూసి స్థానిక ప్రజలు మురిసిపోగా, ఆమెకు భద్రత కల్పిస్తున్నా జెడ్ ప్లస్ భద్రతా సిబ్బంది, జిల్లా అధికారులు ఆశ్చర్యపోయారు. పూజ ముగించుకొన్న తరువాత ఆమె అందరినీ ఆప్యాయంగా పలకరించి అక్కడి నుంచి బయలుదేరారు.

నిన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించి ఆమె రాష్ట్రపతి కావడం ఒడిశా రాష్ట్రానికి చాలా గర్వకారణమని అన్నారు. 


Related Post