పేద ముస్లింల కొరకు మతపెద్దలు సంచలన నిర్ణయం

January 20, 2022
img

వెనుకటి రోజుల్లో అయినా...ఇప్పటి రోజుల్లో అయినా పెళ్ళంటే ఆడపిల్ల తల్లితండ్రులకు చాలా భారంగానే ఉంటోంది. ఉన్నత ఆదాయ వర్గాలకు ఇది వేడుక కావచ్చు కానీ మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలకు పెళ్ళంటే తలకు మించిన వ్యవహారమే అని అందరికీ తెలుసు. అయినప్పటికీ అప్పోసొప్పో చేసి తమ తాహతుకి మించి పెళ్ళిళ్ళు చేసి రోడ్డున పడుతున్నవారు కోకొల్లలున్నారు. 

రాజన్న సిరిసిల్లా జిల్లాలో ముస్లిం పెద్దలు ఈ సమస్య తీవ్రతను గుర్తించి సంచలన నిర్ణయం తీసుకొన్నారు. బుదవారం వేములవాడ పట్టణంలో సమావేశమయ్యి ఈ సమస్యపై లోతుగా చర్చించిన తరువాత ఇక నుంచి పెళ్ళిళ్ళలో ఒక్క కూర, ఒక్క స్వీటుతో భోజనాలు సరిపెట్టాలని నిర్ణయించారు. పేద ముస్లిం కుటుంబాల ఆర్ధిక పరిస్థితిని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వారు తెలిపారు. ఓ పక్క కరోనా కారణంగా ఆదాయం కోల్పోవడమో లేదా తగ్గిపోతుంటే మరోపక్క నిత్యావసర సరుకుల ధరలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. కనుక ఈ పరిస్థితులలో తాహతుకి మించి ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేయడం సరికాదని ముస్లిం మతపెద్దలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక ఒక్క కూర, స్వీటుతో వివాహ భోజనం పెట్టినా ఎవరూ అభ్యంతరం చెప్పవద్దని సూచించారు. 

Related Post