దూసుకొస్తున్న జవాద్ తుఫాన్...ఏపీ, ఒడిశా హై అలర్ట్

December 03, 2021
img

ఇప్పుడు నెలకు రెండు మూడు తుఫానులు సర్వసాధారణమైపోయాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారి ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై విరుచుకు పడేందుకు దూసుకువస్తోంది. దీనికి జవాద్‌గా నామకరణం చేశారు. 

ప్రస్తుతం విశాఖకు దక్షిణ ఆగ్నేయంలో 960 కిమీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1,020 కిమీ దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం సాయంత్రానికి ఇది మరింత బలపడి తుఫానుగా మారి శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిశా తీరానికి చేరుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 


జవాద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో తీరం వెంబడి శుక్రవారం సాయంత్రం నుంచి గంటకు 80-100 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం మధ్యాహ్నంలోగా గోపాల్‌పూర్‌లో జవాద్ తుఫాను తీరందాటి దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంవైపు ప్రయాణించి బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 

కనుక జాలర్లు ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని ఏపీ, ఒడిశా ప్రభుత్వాలు హెచ్చరించాయి. తుఫాను కారణంగా ఏపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో అన్ని పాఠశాలకు, కాలేజీలకు శలవు ప్రకటించింది. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వోద్యోగులకు శలవులు రద్దు చేసి వెంటనే డ్యూటీలో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. తుఫాను కారణంగా దక్షిణమద్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. 

ఏపీ ప్రభుత్వం మూడు తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సహాయ చర్యలు పర్యవేక్షించేందుకు నలుగురు సీనియర్ అధికారులను నియమించింది. వారు వెంటనే రంగంలో జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమావేశమై అవసరమైన ఏర్పాట్ల గురించి చర్చించారు. మందులు, మంచినీళ్ళు, అంబులెన్సులు వగైరా సిద్దం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పోలీస్, మున్సిపల్, టెలీ కమ్యూనికేషన్, విద్యుత్, విపత్తుల నిర్వహణ, వైద్య ఆరోగ్య శాఖలను సమన్వయపరిచి రాష్ట్ర స్థాయిలో అమరాతిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా, జిల్లాలలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే 29 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితులలో వినియోగించడానికి నేవీ కూడా హెలికాప్టర్లు, మరబోట్లను సిద్దంగా ఉంచింది. 

జవాద్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో కూడా అక్కడక్కడ చెదురుముదురుగా వానలు పడే అవకాశం ఉంది.

Related Post