టిఆర్ఎస్‌కు ఎన్నికల కమీషన్‌ షాక్

October 22, 2021
img

టిఆర్ఎస్‌కు కేంద్ర ఎన్నికల కమీషన్‌ (సీఈసీ) షాక్ ఇచ్చింది. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి పొరుగున ఉన్న జిల్లాలలో సభలు, సమావేశాలు నిర్వహించరాదని సీఈసీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నిబందనల కారణంగా హుజూరాబాద్‌లో పార్టీల స్టార్ క్యాంపెయినర్స్ సభలు, సమావేశాలకు వెయ్యి మంది కంటే ఎక్కువ అనుమతించడం లేదు కనుక హుజూరాబాద్‌ పక్కనే ఉన్న హుస్నాబాద్‌లోని ఎల్కతుర్తి మండలంలోమ్ని పెంచికల్ పేటలో సిఎం కేసీఆర్‌ లక్ష మందితో ఎన్నికల ప్రచారసభ నిర్వహించాలనుకొన్నారు. అయితే సీఈసీ గురువారం జారీ చేసిన తాజా ఆదేశాలతో టిఆర్ఎస్‌ అక్కడ బహిరంగ సభ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. 

ఈ నెల 30న పోలింగ్ జరుగుతుంది కనుక రెండు మూడు రోజుల ముందు హుస్నాబాద్‌లో సిఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించి హుజూరాబాద్‌ ఓటర్లను ఆకట్టుకోవచ్చునని టిఆర్ఎస్‌ భావిస్తే సీఈసీ అడ్డుపడటంతో ఇప్పుడు హుజూరాబాద్‌లోనే రెండు రోజుల పాటు సిఎం కేసీఆర్‌ రోడ్ షోలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

సిఎం కేసీఆర్‌ గురువారం ప్రగతి భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యి దీనిపై చర్చించారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారంలో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్, బోయినపల్లి వినోద్ కుమార్‌ తదితరులు సిఎం కేసీఆర్‌ రోడ్ షోకు సన్నాహాలు చేస్తునట్లు తెలుస్తోంది.

Related Post