ఒక్కొక్కరికీ రూ.746 కోట్లు... జెఫ్ బెజోస్ బహుమతి

July 21, 2021
img

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నిన్న దిగ్విజయంగా అంతరిక్షయాత్ర పూర్తి చేసుకువచ్చిన తరువాత ఆ ఆనందంలో ‘కరేజ్ అండ్ సివిలిటీ’ అనే ఓ కొత్త అవార్డును ప్రకటించారు. మొట్టమొదట ఈ అవార్డును ప్రముఖ అంతర్జాతీయ వంటల నిపుణుడు (చెఫ్) జోసెఫ్ ఆండ్రెస్, ప్రముఖ సామాజికవేత్త వాన్ జోన్స్‌లకు ప్రకటించారు. ఈ అవార్డుతో పాటు ఒక్కొక్కరికీ 100 మిలియన్ డాలర్ల నగదు పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు! అంటే భారత్‌ కరెన్సీలో దాని విలువ రూ.742 కోట్లు! 

జోసెఫ్ ఆండ్రెస్: భారత్‌ సహా ప్రపంచ దేశాలలో విపత్కర పరిస్థితులలో ఆహారం లభించక ఆకలితో మాడుతున్న ప్రజలకు ఆహారం అందించేందుకు జోసెఫ్ ఆండ్రెస్ కృషి చేస్తున్నారు. కరోనా సమయంలో ఒక్క భారత్‌లోనే నాలుగు లక్షల భోజనాలు అందించారు. ఆఫ్రికా ఖండంలోని నిరుపేద దేశాలలో ఆకలితో అలమటిస్తున్న వారికీ జోసెఫ్ ఆండ్రెస్ తాను స్థాపించిన వరల్డ్ సెంట్రల్ కిచెన్ పధకం ద్వారా ఆహారం అందిస్తూ వారి ప్రాణాలు కాపాడుతున్నారు. 

వాన్ జోన్స్‌: వాన్ జోన్స్‌ సమాజంలో అట్టడుగు వర్గాలవారి జీవితాలలో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నారు. దీని కోసం ఆయన ది డ్రీమ్ కార్ప్స్, ఎల్లా బేకర్ సెంటర్‌లో ఫర్ హ్యూమన్ రైట్స్, కలర్ ఆఫ్ చేంజ్ వంటి అనేక ఎన్‌జీవో సంస్థలను ఏర్పాటు చేసారు. ఆయన ప్రముఖ టీవీ యాంకర్, రచయిత కూడా. ఆయన రచించిన ది గ్రీన్‌ సిగ్నల్‌ కాలర్ ఎకానమీ, రీబిల్డ్ డ్రీమ్, బియాండ్ ది మెస్సీ ట్రూత్ వంటి పుస్తకాలు ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. వాన్ జోన్స్ గతంలో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు సలహాదారుగా పనిచేశారు.

Related Post