కల్వకుర్తిలో రూ.5 లక్షలు నగదును కాల్చేసిన బ్రోకర్

April 07, 2021
img

నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి పట్టణంలో ఓ బ్రోకర్ ఏసీబీ అధికారులను చూసి భయపడి రూ.5 లక్షలు నగదుకు నిప్పు పెట్టి కాల్చేశాడు.

ఏసీబీ అధికారులు చెప్పిన దాని ప్రకారం రంగారెడ్డి జిల్లాలోని కొరెంతకుంట తండా సర్పంచి రామావత్ నాయక్ నాగర్‌కర్నూల్ జిల్లాలోని వెల్దండ మండలంలోని  బొల్లంపల్లి గ్రామంలో ఓ క్రషర్ ఏర్పాటు చేసుకోవాలనుకొన్నాడు. దానికోసం దరఖాస్తు చేసుకోగా ఆ భూమిని వెల్దండ తహశీల్దార్ సైదులు చేత సర్వే చేయించుకొని ఎన్ఓసీ తెచ్చుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారులు చెప్పడంతో రామావత్ నాయక్ అతనిని కలిశాడు. కానీ ఎన్ఓసీ ఇవ్వాలంటే రూ.6 లక్షలు లంచం ఇవ్వాలని తహశీల్దార్ సైదులు డిమాండ్ చేశాడు. చివరికి రూ.5 లక్షలకు బేరం కుదిరింది. ఆ డబ్బును తన బ్రోకర్‌ (మాజీ వైస్‌ ఎంపీపీ) వెంకటయ్య గౌడ్‌కు ఇవ్వాలని తహశీల్దార్ సైదులు చెప్పాడు. 

అందుకు అంగీకరించిన రామావత్ నాయక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు అతను కల్వకుర్తి పట్టణంలో వెంకటయ్య గౌడ్‌ ఇంటికి వెళ్ళి రూ.5 లక్షల నగదును ఇచ్చాడు. కానీ అతని వెనుక ఎవరో అపరిచితులు ఉండటం చూసి భయపడి వెంటనే ఇంటి తలుపులు మూసేసి ఆ నగదును వంటింట్లో గ్యాస్ స్టౌపై పెట్టి కాల్చేసేందుకు ప్రయత్నించాడు. ఏసీబీ అధికారులు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించి మంటల్లో కాలిపోతున్న ఆ నగదును స్వాధీనం చేసుకొని వెంకటయ్య గౌడ్‌ను, ఆ తరువాత వెల్దండ తహశీల్దార్ సైదులును అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేశారు. 

కల్వకుర్తిలో వెంకటయ్య గౌడ్‌ను అరెస్ట్ చేసిన సమయంలోనే ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని జిల్లెలగూడలోని అతని ఇంట్లో, ఎల్బీ నగర్‌లోని తహశీల్దార్ సైదులు ఇంట్లో, వెల్దండలో తహశీల్దార్ కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేశారు.   

ఈ వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే రూ.5 లక్షల నగదును మంటపెట్టడం కాదు... వెల్దండ తహశీల్దార్ సైదులును, వెంకటయ్య గౌడ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలియగానే వారి బాధితులు వెల్దండ బస్టాండ్‌ వద్ద టపాసులు కాల్చి సంబురాలు చేసుకోవడం! 

Related Post