వృద్ధాప్యంలో క్షణికావేశం...హత్య...ఆత్మహత్య!

March 04, 2021
img

సాధారణంగా వృద్ధాప్యంలో ఆరోగ్యసమస్యలతో బాధపడేవారి గురించి లేదా పిల్లలు నిరాదరణతో దయనీయజీవితాలు గడుపుతున్న వారి గురించి తరచూ వింటుంటాము. కానీ సుఖసంతోషాలతో జీవిస్తూ క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలు చేసుకొనేవారి గురించి విని ఉండము. ఖమ్మం జిల్లా, తల్లాడ మండలంలోని రంగంబంజరలో ఉంటున్న ఓ వృద్ధదంపతులు క్షణికావేశానికి బలైపోయారు. 

పోలీసుల సమాచారం ప్రకారం... సుబ్రహ్మణ్యేశ్వర్ రావు (65), విజయలక్ష్మి (60) దంపతులకు జీవితంలో ఏ లోటూ లేకుండా హాయిగా జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె వివాహం తరువాత రామగుండంలో స్థిరపడగా, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా చేస్తున్న చిన్న కుమార్తె అమెరికాలో స్థిరపడింది. పదేళ్ళ క్రితం వారిరువురూ అమెరికా వెళ్ళి చిన్న కుమార్తె దగ్గర కొన్ని నెలలు గడిపి వచ్చారు. మళ్ళీ అప్పటి నుంచి అమెరికా వెళ్ళలేదు. కనుక వారిని అమెరికా రావలసింది చిన్న కుమార్తె కోరుతోంది. అయితే సుబ్రహ్మణ్యేశ్వర్ రావు అమెరికా వెళ్ళేందుకు ఇష్టపడటంలేదు. కనీసం తననైనా అమెరికాలో కుమార్తె దగ్గరకు పంపమని విజయలక్ష్మి భర్తను అడుగుతోంది. కానీ అతను అంగీకరించకపోవడంతో ఈ విషయమై గత కొన్నిరోజులుగా వారిద్దరి మద్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. భర్త అంగీకరించకపోవడంతో విజయలక్ష్మి సొంతంగా ప్లేన్ టికెట్ కొనుకొన్నారు. దాంతో సుబ్రహ్మణ్యేశ్వర్ రావు క్షణికావేశంలో భార్యను కత్తితో పొడిచి అంతమొందించి ఆ తరువాత పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నారు. బుదవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Related Post