తమిళనాడుకు తుఫాను గండం

November 24, 2020
img

నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈరోజు ఉదయానికి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం చెన్నైకి 540 కిమీ దూరంలో ఆగ్నేయదిశలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. మరో 24 గంటలలోగా అది తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తుఫానుగా మారితే ‘నివర్’ అనే పేరుతో దానికి సంబందించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని చెప్పారు. ప్రస్తుతం గంటకు 11 కిమీ వేగంతో కదులుతున్న వాయుగుండం వాయవ్యదిశలో ప్రయాణించి బుదవారం సాయంత్రం లేదా రాత్రికి తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో మళ్ళాపురంలో తీరం దాటవచ్చని తెలిపారు. ఆ సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంగా బలమైన గాలులు, ఉరుములు మెరుపులతో ఈ నెల 27వరకు భారీవర్షాలు పడవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం ప్రభావం తమిళనాడులో పలు జిల్లాలతో పాటు ఏపీలోని అనంతపురం, నెల్లూరు జిల్లాలపై కూడా అప్పుడే కనిపిస్తోంది. తెలంగాణలో కూడా వాతావరణంలో మార్పు కనిపించింది. కొన్ని ప్రాంతాలలో చిరుజల్లులు పడినట్లు సమాచారం.   

 వాతావరణశాఖ హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం నుంచే మత్స్యకారులను సముద్రంలో చేపల వేటకు వెళ్ళకుండా నిషేదించింది. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. సహాయసిబ్బంది, రెస్క్యూ బోట్లు, అంబులెన్సులు వగైరా సిద్దంగా ఉంచింది. తుఫాను బాధితులకు అందించేందుకు భారీగా ఆహారసామాగ్రిని నిలువచేస్తోంది. ప్రాణనష్టం అరికట్టడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టింది. ఏపీ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొంటోంది.

Related Post