శబరిమలై ప్రైవేట్ ప్రాపర్టీ కాదు: సుప్రీంకోర్టు

July 18, 2018
img

కేరళలో ప్రముఖపుణ్యక్షేత్రం శబరిమలైలోకి యుక్తవయసులో ఉన్న మహిళలను అనుమతించరు. అనేక ఏళ్ళుగా అక్కడ ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఇదివరకటి రోజుల్లో మహిళలు ఈ ఆనవాయితీని గౌరవిస్తూ అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశం గురించి ఎన్నడూ ఆలోచించేవారు కారు. కానీ నేటి ఆధునికయుగంలో అన్ని రంగాలలో పురుషులతో పోటీపడుతూ జీవిస్తున్న మహిళలు ఈ నియమం తమకు అవమానకరమని భావించడం సహజమే. 

దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన ఒక పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తీర్పు చెపుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “అయ్యప్పస్వామి ఆలయంలో మహిళలను అనుమతించకపోవడం వారి ప్రాధమిక హక్కులను నిరాకరించడమే. పురుషులలాగే స్త్రీలు కూడా ఆ దేవుని సృష్టిలో భాగమే. మరి వారి పట్ల ఆచారాల పేరిట ఈ వివక్ష ఎందుకు? ఆలయాలు ప్రజల ఆస్తిగా భావించాలి తప్ప ప్రైవేట్ సంస్థలుగా కాదు. కనుక ఆలయాలలో జరిగే ఆచార వ్యవహారాలను కూడా ప్రైవేట్ వ్యవహారాలుగా భావించలేము. కనుక ఆలయాలలోకి ఎవరికైనా ప్రవేశించే హక్కు ఉంటుంది,” అని అన్నారు. 

ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ఎవరూ తప్పుపట్టలేరు. కానీ చట్టం చట్రంలో మతవిశ్వాసాలు, ఆచారాలు, ఆనవాయితీలను ఇమడ్చడం కష్టం. ఒకవేళ ఇమిడ్చినా వాటిని ప్రజల చేత అఆచరింపజేయడం చాలా కష్టం. ఉదాహరణకు ముస్లింలలో అమలులో ఉన్న ‘ట్రిపుల్ తలాక్’ పద్ధతి వలన అనేకమంది మహిళలు, వారి పిల్లల జీవితాలు చిద్రం అవుతున్నాయి. కనుక సుప్రీంకోర్టు దానిని ఆరు నెలలపాటు నిషేధించింది. కానీ నేటికీ దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్ అమలవుతూనే ఉంది. అదేవిధంగా ఇప్పుడు ‘శబరిమలై ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చు’ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినంత మాత్రాన్న అది ఆచరణలోకి వచ్చేస్తుందని ఆశించలేము. 


Related Post