కేసీఆర్‌కు తొలి నోటీస్ జారీ...

June 11, 2024


img

కేసీఆర్‌ హయాంలో ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహ రెడ్డి కమీషన్, మాజీ సిఎం కేసీఆర్‌కు నోటీస్ పంపింది. ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 30వ తేదీన కమీషన్ ముందు హాజరు కావాలని నోటీసులు పేర్కొంది. 

జస్టిస్ నరసింహ రెడ్డి కమీషన్ సోమవారం విచారణ చేపట్టినప్పుడు, కేసీఆర్‌ ప్రభుత్వంలో ఇందన శాఖ ముఖ్య కార్యదర్శిగా చేసిన సురేష్ చందా, ట్రాన్స్‌కో, జెన్‌కోల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావులపై ప్రశ్నల వర్షం గుప్పించింది. 

ప్రభుత్వం ఏదైనా ఓ పని చేపట్టాలనుకుంటే నిబందనల ప్రకారం టెండర్లు పిలిచి వాటిలో అతి తక్కువ ధర కోట్ చేసిన సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వాలి. కానీ యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణం కొరకు, ఛత్తీస్‌ఘడ్‌ నుంచి విద్యుత్ కొనుగోలుకి ఎందుకు టెండర్లు పిలవలేదు? ఈ రెండు నిర్ణయాలు ఎవరివి? 

టెండర్లు పిలిస్తే కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా తక్కువ ధరకు విద్యుత్ లభించే అవకాశం ఉన్నప్పుడు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించే అవకాశం ఉన్నప్పుడు, టెండర్లు పిలవకపోవడం వలన ఎంత లాభం, నష్టం జరిగిందో ఎలా తెలుస్తుంది? 

అప్పటి అవసరాలను బట్టి గత ప్రభుత్వం అంటే అప్పటి ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు టెండర్లు పిలవకుండా ఈ రెండు పనులు చేపట్టామని  దేవులపల్లి ప్రభాకర్ రావు చెప్పిన్నట్లు తెలుస్తోంది. 

కేసీఆర్‌ హయాంలో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులుగా చేసిన జోషి, అర్వింద్ కుమార్‌ ఇద్దరినీ కూడా కమీషన్ ప్రశ్నిస్తోంది. వారిలో అర్వింద్ కుమార్‌ ఛత్తీస్‌ఘడ్‌ నుంచి హడావుడిగా విద్యుత్ కొనుగోలు చేయడం వలన తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలపై ఆర్ధిక భారం పడుతుందని ముందే కేసీఆర్‌ని లిఖిత పూర్వకంగా హెచ్చరించారు. కనుక ఆయన కేసీఆర్‌ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని చెప్పే అవకాశం ఉంది. విధ్యుత్ శాఖ ఉన్నతాధికారులందరినీ ఈ రెండు అంశాలపై ప్రశ్నించి వారు చెప్పిన వివరాల ఆధారంగా చివరిగా మాజీ సిఎం కేసీఆర్‌ని ప్రశ్నించబోతోంది. 

కేసీఆర్‌కు మొట్ట మొదట ఫోన్ ట్యాపింగ్‌ కేసులో నోటీస్ వస్తుందనుకుంటే విద్యుత్ అంశాలపై నోటీస్ అందింది. 


Related Post