బిఆర్ఎస్‌ ఉంటుందో లేదో? కడియం శ్రీహరి

June 09, 2024


img

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం జనగామ జిల్లాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, బీజేపీ, బిఆర్ఎస్‌ పార్టీలకు చురకలు వేశారు. 

బిఆర్ఎస్‌ గురించి మాట్లాడుతూ, “కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానని, ప్రధాన మంత్రి అవుతానని గొప్పలు చెప్పుకున్నారు. కానీ తెలంగాణలోనే ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడం సిగ్గుచేటు.

వరుసగా రెండు ఎన్నికలలో ఓడిపోయినా బిఆర్ఎస్‌ నేతల మైండ్ సెట్ ఇంకా మారలేదు. ఈ పరిస్థితిలో ఆ పార్టీ ఇంకా ఎంతకాలం మనుగడ సాగించగలదో తెలీదు. ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నప్పుడు ప్రజలు నా మార్పుని అంగీకరిస్తారో లేదో అని భయపడ్డాను. కానీ ప్రజలు కూడా పరిస్థితి అర్ధం చేసుకొని వరంగల్‌ నుంచి పోటీ చేసిన నా కుమార్తె కావ్యాని భారీ మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించారు.  ఇందుకు వరంగల్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను,” అని అన్నారు.

కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం ఏర్పాటు గురించి మాట్లాడుతూ, “ఈసారి బీజేపీకి 400కి పైగా సీట్లు వస్తాయని గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఈసారి సీట్లు తగ్గిపోవడంతో బీజేపీ ముఖ్య నేతలు చాలా ఆందోళనతో ఉన్నారు. ఇండియా కూటమి పుంజుకోవడం కూడా వారి ఆందోళనకు కారణంగా కనిపిస్తోంది.

ఇప్పుడు మోడీ ప్రభుత్వం మనుగడ నితీష్ కుమార్‌, చంద్రబాబు నాయుడు ఇద్దరిపైనే ఆధారపడి ఉంది. వారు తప్పుకుంటే ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగలేదు. కనుక ఇకనైనా బీజేపీ మిడిసిపడటం మానుకుని రాష్ట్రాలకు సహకరిస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలి,” అని కడియం శ్రీహరి అన్నారు. 


Related Post