కేసీఆర్‌ దయతో నాకు పదవులు రాలేదు: గుత్తా

April 20, 2024


img

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ ఎన్నికల  తర్వాత క్రమంగా పార్టీకి దూరం అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నారు కానీ సాధ్యపడలేదు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “బిఆర్ఎస్ పార్టీలో నేతలందరికీ కళ్ళు నెత్తికెక్కి చాలా అహంకారంగా మాట్లాడుతున్నారు. శాసనసభ ఎన్నికలలో నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్‌, నిజామాబాద్‌ జిల్లాలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం మాజీ మంత్రులే.

పార్టీలో నెలకొన్న సమస్యల గురించి కేసీఆర్‌తో మాట్లాడుదామని ప్రయత్నిస్తే ఆయన నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఓటమి తర్వాత ఫామ్‌హౌస్‌లో కూర్చొని బాధపడుతున్నప్పుడు మాత్రమే అందరికీ అపాయింట్మెంట్స్ ఇవ్వడం ప్రారంభించారు. అప్పుడు నేను కూడా కలిసి పార్టీలో చేయాల్సిన కొన్ని మార్పులు చేర్పుల గురించి చెప్పాను. కానీ కేసీఆర్‌ నా సలహాలు, సూచనలు పట్టించుకోలేదు. 

సమస్యలపై చర్చిద్దామని అందరినీ ఫామ్‌హౌస్‌కి పిలిచి, ఎవరి మాటలు వినకుండా ఆయనే మాట్లాడుతుంటారు. బిఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి మేము చెప్పిన సలహాలు సూచనలు ఆయన పట్టించుకోలేదు. అందుకే పలువురు నేతలు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు.

 కేసీఆర్‌ దయ వలననే నాకు పదవులు వచ్చాయని కొందరు మాట్లాడుతున్నట్లు విన్నాను. అది అబద్దం. నేను ప్రజల మనిషిని. ప్రజా నాయకుడిని. అందువల్లే నాకు పదవులు లభించాయి. ఎవరి దయాదాక్షిణ్యాలతో నేను పదవులు సంపాదించుకోలేదు. నాకు ఆ అవసరం లేదు కూడా.

నా కొడుకు నా కొడుకు అమిత్‌కు రాకుండా పార్టీలో కొందరు నేతలు అడ్డుకున్నారు. వారు అడ్డుకునంత మాత్రాన్న నా కొడుకు రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోడు. ఏదో రోజు ప్రజాప్రతినిధిగా చట్టసభలో అడుగుపెడతాడు,”  అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 


Related Post