21 రాష్ట్రాలలో మొదటి విడత పోలింగ్‌ షురూ

April 19, 2024


img

నేడు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 102 నియోజకవర్గాలలో తొలి విడత లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతోంది. అరుణాచల ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో నేడు శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నప్పటికీ ఈరోజు తెల్లవారుజాము నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈరోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌ తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి చెన్నై దక్షిణ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఈరోజు పోలింగ్‌ మొదలవగానే ఆమె కూడా క్యూలో నిలబడి ఓటు వేశారు. తమిళ సినీ నటుడు అజిత్ ఇంకా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు చెన్నైలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

మళ్ళీ ఏప్రిల్‌ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1వ తేదీన ఏడు విడతలలో పోలింగ్‌ జరుగబోతోంది.

మే 13న నాలుగవ విడతలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో  ఎన్నికలు జరుగబోతున్నాయి.

తెలంగాణలో 17 ఎంపీ సీట్లు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలతో పాటు ఏపీలో 25 ఎంపీ సీట్లకు, శాసనసభ (175 సీట్లు)కు ఒకే రోజున మే 13న పోలింగ్‌ జరుగబోతోంది. జూన్ 4న ఓట్లు లెక్కించి వెంట వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.


Related Post