ఏప్రిల్‌ 14 వరకు సీబీఐ కస్టడీలో కల్వకుంట్ల కవిత

April 12, 2024


img

లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత ఇన్ని రోజులుగా ఈడీ అధీనంలో తిహార్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆమెని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో సీబీఐ అరెస్ట్ చేసి తమ అధీనంలోకి తీసుకుంది.

ఈరోజు ఆమెను కోర్టులో హాజరు పరిచి 5 రోజులు కస్టడీ కోరగా ఈ నెల 14వరకు అంటే మూడు రోజులు మాత్రమే సీబీఐ కస్టడీకి అనుమతించింది. మళ్ళీ ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు కోర్టులో ఆమెను హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. 

ఆమె కస్టడీకి కోర్టు అనుమతించడంతో సీబీఐ అధికారులు ఆమెను తమ కార్యాలయానికి తీసుకువెళ్ళారు. మూడు రోజులు అక్కడే ఉంచి ఆమెను ప్రశ్నించనున్నారు. 

ఈరోజు ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ దాఖలు చేసిన రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు పేర్కొంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కల్వకుంట్ల కవితే అని స్పష్టం చేసింది. ఈ కేసులో అప్రూవరుగా మారిన మరో నిందితుడు అరబిందో ఫార్మా అధినేత శరత్ చంద్రారెడ్డిని ఆమె బెదిరించి రూ.80 లక్షలు తన తెలంగాణ జాగృతి ఖాతాలో వేయించుకున్నారని పేర్కొంది.

ఆ తర్వాత మహబూబ్ నగర్‌లో ఓ వ్యవసాయ భూమిని ఆయన కొనుగోలు చేసిన్నట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మరో రూ.14 కోట్లు వసూలు చేశారని సీబీఐ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. 

ఈ కేసులో నిందితుడు ఏపీ వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నుంచి కూడా కల్వకుంట్ల కవిత రూ.25 కోట్లు వసూలు చేశారని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. ఢిల్లీ ఆమాద్మీ  ప్రభుత్వంలో పెద్దలకు ఆమె ద్వారానే రూ.100 కోట్లు ముడుపులు ముట్టాయని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. 

ఈడీ, సీబీఐ వేర్వేరుగా పేర్కొన్న ఇటువంటి ఆరోపణలన్నిటినీ అవి నిరూపిస్తాయో లేదో తెలీదు కానీ ఈ కేసుతో రాజకీయాలు కూడా ముడిపడి ఉన్నందున, రాజకీయ పరిణామాలలో మార్పులు చేర్పులు జరిగితే ఈ కేసులన్నీ నిశబ్ధంగా అటకెక్కిపోవడం ఖాయమే.


Related Post