బండి సంజయ్‌ వాహనంపై కోడిగుడ్లతో దాడి

February 28, 2024


img

బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు ఈరోజు హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలంలోని వంగరలో పర్యటిస్తున్నప్పుడు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై కొందరు దుండగులు కోడిగుడ్లని విసిరి పారిపోయారు. ఆయన మండలంలో ప్రజాహిత యాత్రలో భాగంగా నేడు వంగరలోని దివంగత ప్రధాని పీవీ నరసింహారావు ఇంటిని సందర్శించి తిరిగి బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగింది.

గత రెండు రోజుల నుంచి బండి సంజయ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్ మద్య మాటల యుద్ధం జరుగుతుండటంతో, పొన్నం అనుచరులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చని బండి సంజయ్‌ అనుమానిస్తున్నారు.

పొన్నం ప్రభాకర్ తనను రాజకీయంగా ఎదుర్కొలేక తన అనుచరుల చేత ఈ విధంగా భౌతిక దాడులు చేయిస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే పొన్నం అనుచరులు తనపై కోడిగుడ్లతో దాడి చేసినా పట్టిచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు భద్రత కల్పించలేనప్పుడు, తనపై దాడి జరిగినా కేసు నమోదు చేయనప్పుడు, ఇక వెంట పోలీసులు ఉండి ఏం ప్రయోజనం అంటూ బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారులో వెళ్ళిపోయారు. 

అంతకు ముందు పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నేను సాయపడితే అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యవనే సంగతి మరిచి, ఇప్పుడు నా తల్లినే అవమానిస్తూ మాట్లాడుతావా బండి సంజయ్‌?నా తల్లికి ఈ రాజకీయాలతో సంబంధం ఏమిటి? ఓ తల్లిని గౌరవించలేని నువ్వు రాముడిని ఎలా గౌరవిస్తావు? డుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయావు నువ్వా నన్ను ఆక్షేపించేది?” అంటూ నిప్పులు చెరిగారు. 

లోక్‌సభ ఎన్నికల కోసం బండి సంజయ్‌ అయోధ్య రాముడి పేరుతో మత రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించినప్పటి నుంచి వారిద్దరి మద్య గొడవ ప్రారంభమైంది. కనుక లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు బహుశః ఈ గొడవ సాగుతూనే ఉండవచ్చు. 


Related Post