తెలంగాణ మహాలక్ష్మిలకు ఓ శుభవార్త!

February 25, 2024


img

తెలంగాణ మహాలక్ష్మిలకు ఓ శుభవార్త! కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి పధకంలో రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ఆర్ధిక శాఖ రూ.80 కోట్లు పౌరసరఫరాలకు విడుదల చేసింది.

ఈ నెల 27వ తేదీన చేవెళ్ళలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించి, ప్రియాంకా గాంధీ చేతుల మీదుగా ఈ పధకాన్ని ప్రారంభించాలని సిఎం రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. 

ఈ పధకంలో లబ్ధిదారులు ముందుగా పూర్తి సొమ్ము చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లపై రాయితీ సొమ్ముని లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా జమా చేస్తుంది.

గత మూడేళ్ళలో వాడిన సిలిండర్ల సగటుని బట్టి ఏడాదికి ఎన్ని సిలిండర్లకు రాయితీ ఇవ్వాలనేది ఖరారు చేస్తారు. కనుక గత మూడేళ్ళుగా గ్యాస్ కనెక్షన్, ఆహార భద్రత కార్డులు కలిగినవారు మాత్రమే రాయితీ గ్యాస్ సిలిండర్ల పధకానికి అర్హులు.

తెలంగాణలో సుమారు 40 లక్షల కుటుంబాలను అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కనుక తొలిదశలో వారికి మాత్రమే ఈ పధకాన్ని వర్తింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.80 కోట్లు విడుదల చేసింది.      

చేవెళ్ళ సభలోనే గృహ జ్యోతిలో భాగంగా నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా పధకాన్ని కూడా ప్రారంభించనున్నారు.


Related Post