బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసి, విచారణకు హాజరుకావాలంటూ ఆదివారం నోటీస్ అందజేశారు. జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై సెక్షన్స్ 294బి, 504, 506 కింద కేసు నమోదు చేసి, నేడు నోటీస్ ఇచ్చారు.
దీనిపై బాల్క సుమన్ స్పందిస్తూ, “తెలంగాణ ఉద్యమ సమయంలో నాపై అనేక పోలీస్ కేసులు నమోదు అయ్యాయి. అప్పుడే నేను భయపడలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నన్ను రాజకీయ కక్ష సాధించేందుకు కేసులు పెడితే భయపడతానా?
ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయమని అడిగితే పోలీస్ కేసులు పెట్టించేస్తారా?నాపై ఇంకా ఎన్ని కేసులు పెట్టినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ అమలుచేసే వరకు నేను ప్రశ్నిస్తుంటే ఉంటాను,” అని అన్నారు.