ఒకరో ఇద్దరో బిఆర్ఎస్‌ వీడితే నష్టం లేదు: కేటీఆర్‌

February 11, 2024


img

బిఆర్ఎస్ పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం తెలంగాణ భవన్‌లో నగరంలోని బిఆర్ఎస్‌ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సిఎం రేవంత్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “ రేవంత్‌ రెడ్డి ఓటుకి నోటు కేసులో దొరికిపోయిన ఓ దొంగ. అటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తుండటం మన దౌర్భాగ్యం. 

కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్‌లో కొంత భాగమే క్రుంగింది తప్ప మొత్తం బ్యారేజ్ అంతా క్రుంగలేదు. కనుక దానికి మరమత్తులు చేసి సరిచేయకుండా ఆ పేరుతో రాజకీయాలు చేస్తూ బిఆర్ఎస్‌ పార్టీపై బురద జల్లుతోంది. 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అన్ని శాఖలు, అన్ని రంగాలలో  అయోమయం నెలకొంది. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్‌ మెట్రో విస్తరణ పనులు నిలిపివేయించేశారు. ఫార్మా సిటీని అటకెక్కెకించేసేందుకు సిద్దమవుతున్నారు.

జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ మీటింగ్, స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్స్ కూడా జరగనీయడం లేదు. రైతు బంధు, దళిత బంధు, ధరణీ పోర్టల్‌, ఇలా ప్రతీదీ రద్దు చేస్తుండటంతో పరిపాలన స్తంభించిపోతోంది. 

ఆరు గ్యారెంటీ పధకాలలో హామీలకు బడ్జెట్‌లో తగినంత కేటాయింపులు చేయకపోవడం గమనిస్తే హామీలను అమలుచేయాలనే ఉద్దేశ్యం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదని అర్దమవుతోంది. కేవలం 60 రోజుల కాంగ్రెస్‌ పాలనలోనే రాష్ట్రంలో అన్నిటినీ అస్తవ్యస్తం చేసేశారు,” అని అన్నారు. 

ఇటీవల కొందరు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు వెళ్ళి సిఎం రేవంత్‌ రెడ్డిని కలవడంపై స్పందిస్తూ, “మన ఎమ్మెల్యేలు ప్రజా పాలన సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలిసి ఉండవచ్చు. కానీ ఒకవేళ ఎవరైనా పార్టీని వీడాలనుకున్నా నష్టం ఏమీ లేదు,” అని అన్నారు.


Related Post