శనివారంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నందున మోడీ ప్రభుత్వం హయాంలో ఇవే చివరి పార్లమెంట్ సమావేశాలు. ఈ కారణంగా ప్రధాని నరేంద్రమోడీతో సహా పార్లమెంట్ సభ్యులందరూ భావోద్వేగానికి గురయ్యారు.
శనివారం బడ్జెట్ సమావేశాలు ముగియగానే లోక్‌సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీష్ దన్‌ఖడ్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి.
ఈ 5 ఏళ్ళ పాలనలో తమ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని అమలు పరిచిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. జమ్ముకాశ్మీర్ 370వ అధికరణం రద్దు, ట్రిపుల్ తలాక్ విధానం రద్దు, మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించే బిల్లు, అయోధ్యలో రామమందిరం నిర్మించడం వంటివన్నీ చాలా కీలకమైనవేనని, వీటి కోసం దేశంలో అనేక తరాల ప్రజలు ఎదురుచూశారని అన్నారు.
సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యం చాలామందికి ఉండదని, కానీ తమ ప్రభుత్వం కరోనా వంటి అతిపెద్ద సమస్యలను సైతం ధైర్యంగా ఎదుర్కొని దేశాన్ని, ప్రజలను కాపాడుకుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.