తెలంగాణలో గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో భాగంగా ఉన్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లు ఆవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆ వ్యవస్థను రద్దు చేసింది. కానీ రెవెన్యూ విభాగంలో వీఆర్ఏ వ్యవస్థ చాలా అవసరమని అధికారులు వాదిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వారి అభిప్రాయాలను, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీఆర్ఏల సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుని, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్దరించాలని నిర్ణయించింది.
అయితే దానిలో అనేక సమస్యలు కూడా ఉన్నందున ఈ వ్యవస్థపై లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్వర్యంలో, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
రాష్ట్రంలో మొత్తం 20,555 మంది వీఆర్ఏలు ఉండగా వారిలో 16,758 మందిని మంది ఉద్యోగాలను క్రమబద్దీకరించి 14,985మందిని వివిద శాఖలలో సర్దుబాటు చేసింది. మిగిలినవారి పరిస్థితి దయనీయంగా మారింది.
ప్రభుత్వ శాఖలలో సర్దుబాటు చేసిన 14,985 మంది వీఆర్ఏల వలన తమ పదోన్నతులకు అవరోధం ఏర్పడుతుందంటూ ప్రభుత్వ కార్యాలయాలలో ‘ఆఫీస్ సబార్డినేట్స్’గా పనిచేస్తున్న ఉద్యోగులు కోర్టులో కేసు వేయడంతో యధాతధ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది.
అప్పటికే 80 శాతం మంది ఉద్యోగాలలో చేరారు. దీంతో ఆ ఉద్యోగాలలో చేరిన, ఇంకా చేరని వీఆర్ఏల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. కనుక ఈ సమస్యలన్నిటికీ కమిటీ త్వరలోనే తగిన పరిష్కారాలు సూచిస్తే, రాష్ట్రంలో మళ్ళీ వీఆర్ఏ వ్యవస్థ ఏర్పాటవుతుంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి బహుశః రెండు మూడు నెలల సమయం పట్టవచ్చు.