రోజా రొయ్యల పులుసు... అంత రుచిగా ఉంటుందా?

February 10, 2024


img

ఏపీ మంత్రి రోజా సినిమా, జబర్దస్త్ నేపధ్యం అందరికీ తెలిసిందే. అయితే ఆమె రొయ్యల పులుసు అద్భుతంగా వండగలరనే కొత్త విషయం తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి నిన్న శాసనసభలో బయటపెట్టారు. 

ఇదివరకు కేసీఆర్‌ తిరుపతికి వెళ్ళినప్పుడు ఆమె రాగి సంకటి, రొయ్యల పులుసు చేసి పెట్టారని చెప్పారు. అప్పటి నుంచే కేసీఆర్‌ ఆంధ్రా మంత్రులకు ‘ఫిదా’ అయిపోయారని అన్నారు. 

ఆ తర్వాత ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌ వచ్చినప్పుడు కేసీఆర్‌ ఇంట్లో విందు భోజనం చేశారని, అప్పుడే కృష్ణ జలాలను రాయలసీమకు తరలించుకుపోయేందుకు, సీమలో ప్రాజెక్టులు కట్టుకునేందుకు ఇరువురి మద్య ఒప్పందం జరిగిందని సిఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. 

అందుకే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌, సాగునీటిశాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఇద్దరూ కూడా ఏపీలో జగన్‌ ప్రభుత్వం సీమలో ప్రాజెక్టులు కడుతున్నా అడ్డుకోలేదు. కనీసం అభ్యంతరం చెప్పలేదన్నారు. 

రాష్ట్రంలో పోలింగ్ జరుగుతున్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి తన పోలీసులను పంపించి కబ్జా చేసి గేట్లు తెరుచుకుని నీళ్ళు దొంగతనం చేస్తుంటే కేసీఆర్‌ ఎందుకు మాట్లాడలేదని, ఎందుకు అడ్డుకోలేదని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.  

రాయలసీమలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల వలన తెలంగాణ రైతులకు నష్టం కలుగుతున్నా మాట్లాడని కేసీఆర్‌, ఇప్పుడు కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకి అప్పగిస్తే రైతులు నష్టపోతారంటూ మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారని సిఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు.  

ఏపీలో వైసీపి నేతలతో కేసీఆర్‌, బిఆర్ఎస్ నేతలకు ఎంత బలమైన అనుబంధాలు ఉన్నాయో ఇవన్నీ తెలియజేస్తున్నాయని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.


Related Post