బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీ పధకాలకు ఎంతో?

February 10, 2024


img

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిసారిగా నేడు శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతోంది. ఈసారి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.2.95 లక్షల కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. దానిలో సింహ భాగం ఆరు గ్యారెంటీ పధకాలకే కేటాయించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. వాటి కోసం సుమారు రూ.60,000 కోట్లు అవసరమని ఆర్ధిక శాఖ అంచనా వేసిన్నట్లు తెలుస్తోంది. 

మహాలక్ష్మి పధకం కింద మహిళలకు నెలకు రూ.2,500 సామాజిక పింఛన్ కోసం ఏడాదికి రూ.20,000 కోట్లు, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి గాను టిఎస్‌ఆర్టీసీకి కేటాయించాల్సింది ఏడాదికి రూ.5,000 కోట్లు, గృహజ్యోతి పధకం క్రింద నెలకు 200 యూనిట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సింది రూ.4,200 కోట్లు అని అంచనా వేశారు. 

ఇవి కాక రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్ వంటి అనేక హామీలు అమలుచేయాల్సి ఉంది. బడ్జెట్‌లో వాటన్నిటికీ తప్పనిసరిగా నిధులు కేటాయించక తప్పదు. లేకుంటే ఇప్పటికే హామీల అమలు కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ ఊరుకోదు.

వాటి కోసం బడ్జెట్‌లో కేటాయింపులు చేయకుండా అబద్దాలు చెపుతూ ప్రజలను మోసగిస్తోందని లోక్‌సభ ఎన్నికలలో గట్టిగా ప్రచారం చేసి, కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకు ప్రయత్నించడం ఖాయం.

కానీ ఆరు గ్యారెంటీ పధకాలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం చాలా కష్టం. గత ప్రభుత్వం విచ్చలవిడిగా చేసిన అప్పుల వలన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమీ బాగోలేదని, అప్పులు, వడ్డీ చెల్లింపులకే చాలా ఖర్చు అయిపోతోందని సిఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా చెప్పారు. 

ఈ ఆరు గ్యారెంటీ పధకాలు కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, వివిద శాఖలకు కేటాయింపులు చేయవలసి ఉంటుంది. వాటిలో విద్యా, వైద్యం, అటవీ శాఖ వంటి కొన్ని శాఖల నుంచి వాటి నుంచి ప్రభుత్వానికి రాబడి ఉండకపోయినా భారీగా కేటాయింపులు తప్పవు. కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆదాయవ్యయాలను ఏవిదంగా మేనేజ్ చేస్తుందో బడ్జెట్‌లో చూడాలి.


Related Post