తెలంగాణలో ప్రభుత్వం మారడంతో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. మొదట హైదరాబాద్‌లోని పర్యాటకశాఖ కార్యాలయంలో రెండు రోజుల క్రితం అర్దరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో కార్యాలయంలోని కంప్యూటర్లు, ముఖ్యమైన ఫైల్స్ తగులబడ్డాయి. తాజాగా శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు మాసబ్ టాంక్ వద్ద గల పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో దొంగలు పడ్డారు.
కొన్ని ముఖ్యమైన ఫైల్స్ చించివేసి మరికొన్ని ఫైల్స్, హార్డ్ డిస్కులు ఎత్తుకుపోయిన్నట్లు తెలుస్తోంది. ఆ దొంగలు మరెవరో కారు... మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఓఎస్‌డి (స్పెషల్ ఆఫీసర్) కళ్యాణ్, కంప్యూటర్ ఆపరేటర్ మోహన్, ఎలీజాన్, వెంకటేష్, మరో ఇద్దరు వ్యక్తులని అక్కడ వాచ్‌మాన్‌గా పనిచేస్తున్న లక్ష్మయ్య చెప్పారు. లక్ష్మయ్య వెంటనే పశు సంవర్ధక శాఖ అధికారులకు ఫోన్ చేసి ఈ విషయం తెలియజేయగా వారి ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
అయితే కళ్యాణ్ ఈ ఆరోపణలను ఖండించారు. ప్రభుత్వం మారినందున తన కార్యాలయంలో ఫైల్స్, కంప్యూటర్స్, ఫర్నీచర్ వగైరా సాధారణ పరిపాలన శాఖకు అప్పగించేందుకే తాను అక్కడికి వెళ్ళానని, తాను ఆఫీసులో ప్రవేశించి ఫైల్స్ చించివేసి కొన్నిటిని పట్టుకువెళ్ళిన్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని కనుక పోలీసుల విచారణ ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు.
ప్రభుత్వ కార్యాలయాలలో ఫైల్స్, హార్డ్ డిస్కుల దొంగతనాలపై తక్షణం లోతుగా దర్యాప్తు జరిపించి నిందితులను పట్టుకోవాలని, ఇకపై కార్యాలయాల వద్ద దొంగతనాలు జరగకుండా పటిష్టమైన పోలీస్ భద్రత కల్పించాలని కోరుతూ పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి డిజిపి రవి గుప్తాకు లేఖ వ్రాశారు.