తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారిగా ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. నేటి నుంచి వరుసగా నాలుగు రోజులు సమావేశాలు నిర్వహించాలని మొదట భావించినా, సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత ఉభయసభలను ఈ నెల 14కి వాయిదా వేస్తున్నట్లు ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.
డిసెంబర్ 14న మళ్ళీ సమావేశమైనప్పుడు ముందుగా స్పీకర్‌ని ఎన్నుకొంటారు. మరుసటి రోజున అంటే డిసెంబర్ 15న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. మర్నాడు ఆమెకు ధన్యవాదాలు తెలుపుకొనే తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించి శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి?ఏఏ అంశాలపై చర్చించాలి?అనే దానిపై నిర్ణయం తీసుకొంటుంది.
బిఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్నందున ఈరోజు సమావేశానికి హాజరుకాలేకపోయారు. సిరిసిల్లా బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఇదే కారణంగా నేడు ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. కనుక మరొక రోజున ప్రమాణస్వీకారం చేసేందుకు అనుమతించాలని శాసనసభ కార్యదర్శికి లేఖ పంపించారు. మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్‌గా తాము అంగీకరించమని చెపుతూ 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా నేడు శాసనసభకు హాజరుకాలేదు.