కేసీఆర్ నేతృత్వంలో శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికీ ఆయన నాయకత్వంపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు మొదలైనందున ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యి కేసీఆర్‌ని తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకొన్నారు.
ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు అధ్యక్షతన జరిగిన ఎల్పీ సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ పేరుని శాసనసభ పక్షనేతగా ప్రతిపాదించగా, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు. గెలిచిన 39 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు.
తర్వాత బిఆర్ఎస్ శాసనసభ పక్షం కమిటీని ఏర్పాటు చేసే బాధ్యతను కేసీఆర్‌కి అప్పగిస్తూ చేసిన మరో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన్నట్లు బిఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకొని ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలో ఉన్నందున ఆయన లేకుండానే ఈ సమావేశం నిర్వహించాల్సి వచ్చింది.
ఈ సమావేశం ముగిసిన తర్వాత బిఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అమరవీరుల స్తూపం వద్దకు వెళ్ళి నివాళులు అర్పించి శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు.