కొత్తగా ఎన్నికైన అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రేపు (శనివారం) ప్రమాణస్వీకారాలు చేయనున్నారు. అయితే గత శాసనసభ రద్దు అయినందున కొత్త స్పీకర్‌ని ఎన్నుకోవలసి ఉంటుంది. అందుకోసం ముందుగా ఎమ్మెల్యేలందరూ ప్రమాణస్వీకారం చేయించవలసి ఉంటుంది. అందుకోసం తాత్కాలిక (ప్రోటెం) స్పీకర్‌గా ఒకరిని నియమిస్తారు.
సాధారణంగా అందరి కంటే ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వారిని ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. తెలంగాణ శాసనసభలో అందరి కంటే ఎక్కువగా 8సార్లు కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ ఆయనకు ఈరోజు యశోదా ఆస్పత్రిలో తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స జరుగుతున్నందున 8వారాల వరకు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది.
ఆయన తర్వాత మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లీస్‌కు దగరయ్యి దాని మద్దతు పొందాలనే ఆలోచనలో ఉండి ఉండవచ్చు. కనుక మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకరుగా చేయాలని నిర్ణయించింది.
ఆయన కొత్తగా ఎన్నికకైనా ఎమ్మెల్యేలందరి చేత ప్రమాణస్వీకారాలు చేయిస్తారు. అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ని ఎన్నుకొంటారు. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాదరావుని స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఖరారు చేసింది. అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన చేత కూడా స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయించి కుర్చీలో కూర్చోపెట్టడంతో ప్రోటెం స్పీకర్ బాధ్యత పూర్తయిపోతుంది. అప్పటి నుంచి స్పీకర్ శాసనసభని నడిపిస్తుంటారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు ఉదయం 6.30 గంటలకు రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్ చేత ప్రోటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత ఉభయసభలని ఉద్దేశ్యించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం, తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాలు జరుగుతాయి. తెలంగాణ శాసనసభ సమావేశాలు నాలుగు రోజులపాటు జరుగబోతున్నాయి.