ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రొఫెసర్ కోదండరామ్‌?

December 08, 2023


img

తెలంగాణ ఉద్యమాలలో కేసీఆర్‌తో భుజం భుజం కలిపి పోరాడినవారు ప్రొఫెసర్ కోదండరామ్‌ కూడా ఒకరు. కానీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన  తర్వాత ఆయనను పూర్తిగా పక్కన పెట్టేయడమే కాకుండా తన మంత్రుల చేత ఆయనపై అనేక నిందింపజేశారు. దాంతో ఆయన తెలంగాణ జనసమితి పెట్టుకొని ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చారు. కానీ ఎన్నికలు చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోవడంతో ఒక్కసారి కూడా ఆయన గెలవలేకపోయారు. 

ఆ తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు, నిర్బంధాలు విదిస్తున్నప్పటికీ ఆయన నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్‌ ఈసారి శాసనసభ ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. కేసీఆర్‌ని వ్యతిరేకించేవారినందరినీ కూడగట్టి కాంగ్రెస్‌ విజయానికి ఎంతగానో తోడ్పడ్డారు. 

రేవంత్‌ రెడ్డితో సహా కాంగ్రెస్‌ నేతలందరికీ ఆయన అంటే చాలా గౌరవమే. కనుక రేవంత్‌ రెడ్డి ఆయనను క్యాబినెట్ మంత్రి హోదాతో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించవచ్చని తెలుస్తోంది. 

ఆయనకు తెలంగాణలో సహజవనరులు, ఆర్ధిక, విద్య, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు, బదిలీలు, పదోన్నతులు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై మంచి అవగాహన ఉంది. కనుక ఆయన సలహాలతో ముందుకు సాగితే మంచిదని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఈ పదవిలో ఐఏఎస్ అధికారి రాజీవ్ శర్మ ఉన్నారు. ఆయనను తప్పించి ప్రొఫెసర్ కోదండరామ్‌ని నియమించవచ్చని తెలుస్తోంది. బహుశః అందుకే ప్రొఫెసర్ కోదండరామ్‌ మొన్న సచివాలయానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వానికి, ఉద్యోగులకు మద్య వారధిలా పనిచేస్తానని చెప్పిన్నట్లు భావించవచ్చు.


Related Post