తొలి రోజు నుంచే బిఆర్ఎస్ నేతలకు షాకులు!

December 08, 2023


img

రేవంత్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని గంటలకే బిఆర్ఎస్ నేతలకు షాకులు ఇవ్వడం ప్రారంభించింది. ముందుగా ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్ తగిలింది. నిజామాబాద్‌ జిల్లా, ఆర్మూరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ పక్కనే జీవన్ రెడ్డికి చెందిన జీ-1 మల్టీప్లెక్స్‌ షాపింగ్ మాల్‌కు నిన్న విద్యుత్ సరఫరా నిలిపివేశారు. 

ఆ సంస్థ విద్యుత్ బకాయిలు రూ.2.5 కోట్లకు చేరుకోవడంతో గత ఆరేడు నెలలుగా విద్యుత్ శాఖ నోటీసులు ఇస్తూనే ఉంది. కానీ అప్పుడు బిఆర్ఎస్‌ అధికారంలో ఉన్నందున అధికారులు జీ1 షాపింగ్ మాల్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే విద్యుత్ సరఫరా నిలివేశారు. ఈ విషయాన్ని ఏఈడీ శ్రీధర్ ధృవీకరించారు. తక్షణం విద్యుత్ బకాయిలు చెల్లించితే విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తామని చెప్పారు. 

జీవన్ రెడ్డికి టిఎస్‌ఆర్టీసీ కూడా షాక్ ఇచ్చింది. టిఎస్‌ఆర్టీసీకి చెందిన 7,000 చదరపు గజాల స్థలాన్ని 2013లో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ అనే సంస్థ 33 ఏళ్ళకు లీజుకి తీసుకొంది. దానిలోనే జీవన్ రెడ్డి కొన్నేళ్ళ క్రితం  జీ1 షాపింగ్ మాల్‌ నిర్మించుకొన్నారు. కానీ అప్పటి నుంచి లీజు బకాయిలు చెల్లించడంలేదు. ఆ బకాయిలు రూ.7.23 కోట్లుకు చేరుకొన్నాయి. 

ఇన్నేళ్ళుగా టిఎస్‌ఆర్టీసీ అధికారులు కూడా వాటి కోసం ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తక్షణం ఆ బకాయిలు చెల్లించాలని లేకుంటే షాపింగ్ మాల్‌ స్వాధీనం చేసుకొంటామని నోటీస్ పంపించారు. గురువారం హైదరాబాద్‌లో రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలోనే ఆర్మూరులో టిఎస్‌ఆర్టీసీ సిబ్బంది జీ1 షాపింగ్ మాల్‌ వద్దకు వెళ్ళి మైకులో లీజు బకాయిలు తక్షణం చెల్లించాలని లేకుంటే షాపింగ్ మాల్‌ని జప్తు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. 

ఇది ఒక్క బిఆర్ఎస్‌ నేత భాగోతం మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్‌ నేతల ఇటువంటి భాగోతాలు ఇంకెన్ని బయటపడతాయో? కనుక బిఆర్ఎస్‌ నేతలందరూ తక్షణం తమ పన్నులు, విద్యుత్ బకాయిలు చెల్లించడం మంచిది.


Related Post