తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. పార్టీలో సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. భట్టి విక్రమార్క మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా లభించింది.
ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక సిఎం, డెప్యూటీ సిఎం సిద్దరామయ్య, డికె శివకుమార్ తదితరుల సమక్షంలో సిఎస్ శాంతికుమారి అధ్వర్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వారిచేత ప్రమాణస్వీకారం చేయించారు.
ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు తరలిరావడంతో స్టేడియం నిండిపోయింది. రేవంత్ రెడ్డి, సీతక్క ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు వారి హర్షధ్వానాలతో స్టేడియం మారుమోగిపోయింది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత రేవంత్ రెడ్డి దంపతులు సోనియా గాంధీకి పాదాభివందనం చేశారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పోరాటాలు, అనేకమంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ప్రజలు, రైతులు, నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు.
నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడే అక్కడ ప్రగతి భవన్ గడి ఇనుప కంచెలు, బారికేడ్లు తొలగించడం ప్రారంభం అయ్యింది. తెలంగాణలో మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుద్దరించి ప్రజాపాలన సాగించడానికి ఇది మా ప్రభుత్వం వేసిన తొలి అడుగు. ఇకపై తెలంగాణ ప్రజలందరికీ ప్రజాభవన్ తలుపులు తెరిచే ఉంటాయి.
తెలంగాణ అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకి కట్టుబడి మా ప్రభుత్వం పనిచేస్తుందని మాట ఇస్తున్నాను,” అంటూ రేవంత్ రెడ్డి చాలా భావోద్వేగంతో మాట్లాడారు.
అనంతరం ఆరు గ్యారెంటీలకు సంబందించిన ఫైలుపై ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. తర్వాత ఎన్నికల సమయంలో కలిసిన రజని అనే దివ్యాంగురాలికి ప్రభుత్వోద్యోగం ఇస్తానని ఇచ్చిన హామీ ప్రకారం ఆమెను వేదికపై ఆహ్వానించి అక్కడే సంతకం చేసి అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఆమె చేతికి రేవంత్ రెడ్డి స్వయంగా అందించారు.