పండగలా ప్రచారం... ముగిసింది

November 28, 2023


img

తెలంగాణలో దాదాపు రెండు నెలలుగా అన్ని పార్టీల ఎన్నికల ప్రచారంతో ఎక్కడ చూసిన హడావుడితో పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం గడువు ముగియడంతో మైకులు మూగపోయాయి. 

ఈసారి సిఎం కేసీఆర్‌ అందరి కంటే అత్యధికంగా 96 సభలలో పాల్గొని బిఆర్ఎస్ అభ్యర్ధులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన, అభివృద్ధి, సంక్షేమ పధకాలు, నాటికీ నేటికీ రాష్ట్రంలో వచ్చిన మార్పులు అన్నీ ప్రజలకు చాలా ఓపికగా వివరించి, కాంగ్రెస్‌, బీజేపీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్‌, హరీష్ రావు, కవిత ముగ్గురూ పార్టీ బాధ్యతను మీద వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

ఈసారి బిఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ తరపున పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్ర, మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక సిఎం, డెప్యూటీ సిఎంలు సిద్దరామయ్య, డికె శివకుమార్, ఛత్తీస్‌ఘడ్‌ సిఎం భూపేష్ భాగేల్, రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లెత్ తదితరులు కాంగ్రెస్‌ ప్రచారసభలలో పాల్గొని, పార్టీ శ్రేణుల్లో విజయం సాధించి అధికారంలోకి రాబోతున్నామనే గట్టి నమ్మకం కలిగించగలిగారు. ‘ప్రజలు మార్పు కోరుతున్నారు,’ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయి, బిఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఒత్తిడి పెంచగలిగింది. 

బీజేపీ తరపున ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగీ ఆదిత్యనాథ్ (యూపీ), ప్రమోద్ సావంత్ (గోవా), ఏక్ నాధ్ షిండే (మహారాష్ట్ర), హిమంత బిశ్వ శర్మ(అస్సాం) తదితరులు హాజరయ్యారు. బీజేపీ అధికారంలోకి వస్తే ‘బీసీ ముఖ్యమంత్రి’ని చేస్తామంటూ బీజేపీ గట్టిగా ప్రచారం చేసుకొంది.

ఎన్నికల ప్రచారంలో మూడు ప్రధాన పార్టీలదే పైచేయిగా కనిపిస్తోంది. కనుక పోటీ కూడా వాటి మద్యనే సాగింది. రాజకీయ పార్టీల హడావుడి నేటితో ముగిసింది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం నవంబర్‌ 30వ తేదీన పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. డిసెంబర్‌ 3వ తేదీన తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్లు లెక్కించి అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.                         



Related Post