నేటితో ప్రచారం ముగింపు... ప్రలోభాలు షురూ

November 28, 2023


img

చూస్తుండగానే తెలంగాణ శాసనసభ ఎన్నికల తేదీ దగ్గరకొచ్చేసింది. ఈ నెల 30న పోలింగ్ జరుగబోతున్నందున నిబందనల ప్రకారం 36 గంటల ముందు అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. దాదాపు రెండు నెలలుగా ఎన్నికల ప్రచారంతో హోరెత్తిపోతున్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఒక్కసారిగా నిశబ్ధంగా మారుతుంది. 

అప్పటి నుంచి అన్ని పార్టీలు, వాటి అభ్యర్ధులు నిశబ్ధంగా ఓటర్లకు డబ్బు, మద్యం. బహుమతులు పంచిపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు. ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు పెట్టి, ఎక్కడికక్కడ పోలీసులను మోహరించి వాహనాలను తనికీ చేయిస్తుండటంతో ఇప్పటి వరకు సుమారు రూ.700 కోట్లు నగదు, వెండిబంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. 

అయితే రేపు, ఎల్లుండి ఓటర్లకు పంచబోయే డబ్బు, మద్యం ఇంతకు మించే ఉండవచ్చు. దీనిని బట్టి తెలంగాణ ఎన్నికలు ఎంత ఖరీదైన వ్యవహారంగా మారాయో అర్దం చేసుకోవచ్చు. గట్టి పోటీ ఉన్న చోట ఒక్కో ఓటుకి రూ.5,000 చొప్పున, మిగిలిన చోట్ల రూ.1,000, 2,000,3,000 చొప్పున పంచిపెడుతున్నట్లు తెలుస్తోంది. 

మూడు ప్రధాన పార్టీలు ప్రజలు మావైపే ఉన్నారని గొప్పగా చెప్పుకొంటున్నాయి. కానీ మూడూ పోటీలు పడి మరీ ఓటర్లకు డబ్బు, మద్యం, బహుమతులు పంచుతున్నాయి. మీడియాకు, సామాన్య ప్రజలకు తెలిసిన ఈ విషయం రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియదనుకోలేము. ఇటువంటివి ప్రలోభాలు జరుగకుండా నియంత్రించేందుకు వేలాదిమంది సిబ్బందిని మోహరించినా ఫలితం లేదని స్పష్టమవుతోంది.  


Related Post