తెలంగాణ ప్రజలను ఆకట్టుకొనేందుకు అన్ని పార్టీలు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇస్తున్న బీజేపీ ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదన చేస్తోంది.
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఎన్నికలలో బీజేపీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయం. మేము అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరుని భాగ్యనగరంగా మారుస్తాము. మనకి ఈ హైదర్ ఎందుకు?ఇంకా బానిసపాలన గుర్తులు అవసరమా?తమిళనాడు ప్రజలు మద్రాస్ పేరుని చెన్నైగా మార్చుకొన్నారు. అలాగే బెంగాలీలు కలకత్తా పేరును కోల్‌కతాగా, మహారాష్ట్ర ప్రజలు బొంబాయి పేరుని ముంబైగా మార్చుకొన్నారు. కనుక హైదరాబాద్ పేరుని భాగ్యనగరంగా మార్చుకొంటే తప్పేమిటి?కనుక బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరుని భాగ్యనగరంగా మారుస్తాము,” అని అన్నారు.
దీంతో హిందూ ఓటర్లను ఆకట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతూనే ఉంది. అయితే బిఆర్ఎస్ పార్టీ నిర్మాణాత్మకమైన అంశాల గురించి, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పధకాల గురించి గట్టిగా చెప్పుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నప్పుడు, బీజేపీ చేస్తున్న ఈ ప్రతిపాదన ఓటర్లను ఆకట్టుకొంటుందా? ఇంతకంటే బీసీ ముఖ్యమంత్రి ఎవరో పేరు ప్రకటించి ఉండి ఉంటే బీజేపీకి విజయావకాశాలు పెరిగిఉండేవెమో?