హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ప్రముఖుల హడావుడి షురూ

September 16, 2023


img

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సహా కాంగ్రెస్‌ అగ్రనేతలందరూ నేడు హైదరాబాద్‌ రాబోతున్నారు. ఇప్పటికే 52 మంది కాంగ్రెస్‌ ప్రముఖులు హైదరాబాద్‌ చేరుకొన్నారు. సోనియా, రాహుల్ గాంధీలు కొద్ది సేపటి క్రితమే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు.

 నేడు, రేపు హైదరాబాద్‌లో హోటల్‌ తాజ్ కృష్ణలో జరుగబోయే కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశాలలో పాల్గొనేందుకు వారందరూ హైదరాబాద్‌ తరలివస్తున్నారు. త్వరలో 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల గురించి చర్చించడం కొరకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని కేసీ వేణుగోపాల్ చెప్పారు. 

దేశం నలుమూలల నుంచి ఈ సమావేశాలకు వస్తున్న కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సభ్యులకి, ప్రత్యేక ఆహ్వానితులకి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు హోటల్‌ తాజ్ కృష్ణలో తెలంగాణ కాంగ్రెస్‌ విందు భోజనం ఏర్పాటు చేసింది. భోజనాల తర్వాత సమావేశాలు మొదలవుతాయి.  

అజెండాలో 5 అంశాలు: 1. త్వరలో ఎన్నికలు జరుగబోయే 5 రాష్ట్రాలలో కాంగ్రెస్‌ అనుసరించాల్సిన వ్యూహాలు, 2. 2024లో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు, 3. భారత్‌ జోడో-2 నిర్వహణ, 4. ఇండియా కూటమితో సీట్ల సర్దుబాట్లు, 5.ఈనెల 18 నుంచి 22 వరకు జరుగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలు.


Related Post