తెలంగాణ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ!

March 24, 2023


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత చిక్కుకోవడం,మరోవైపు టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు మరో దెబ్బ పడింది. ఈసారి విద్యుత్‌ ఉద్యోగులు ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు.

ఈరోజు ఉదయం హటాత్తుగా వేలాదిమంది విద్యుత్‌ ఉద్యోగులు హైదరాబాద్‌ సోమాజీగూడ వద్ద గల విద్యుత్‌ సౌధ భవనం వద్దకు చేరుకొని మెరుపు ధర్నా చేశారు. దీని గురించి ముందుగా ఎటువంటి సమాచారం లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకొనేలోగా అందరూ సోమాజీగూడ వద్దకు చేరుకొని ధర్నా చేశారు.

వేతన సవరణ, ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారు మెరుపు ధర్నా చేశారు. హైదరాబాద్‌లో పంజగుట్ట-ఖైరతాబాద్ రోడ్డు ఎప్పుడూ చాలా రద్దీగా ఉంటుంది. ఆ రోడ్డులోకి ఒకేసారి వేలాదిమంది ఉద్యోగులు వచ్చి ధర్నా చేయడంతో చాలాసేపు ట్రాఫిక్ జామ్‌ అయిపోయింది. పోలీసులు ఆందోళన చేస్తున్న ఉద్యోగులను చెదరగొట్టి, అదుపులో తీసుకొని అక్కడి నుంచి తరలిస్తూ వాహనాలకు దారి కల్పిస్తున్నారు. 

ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, కార్మికులు ఈవిదంగా ఆందోళన చేసి తమ డిమాండ్ల పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం సహజమే. అయితే కేసీఆర్‌ ప్రభుత్వం రెండు పెద్ద సమస్యలతో సతమతమవుతున్నవేళ విద్యుత్‌ ఉద్యోగులు కూడా ఆందోళనకు దిగడంతో ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది. 


Related Post