సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత పిటిషన్‌ వాయిదా!

March 23, 2023


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఈడీ కత్తి వ్రేలాడుతుండటంతో, సుప్రీంకోర్టులో ఆమె వేసిన పిటిషన్‌పై తీర్పు సానుకూలంగా వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ అక్కడా ఆమెకు కాస్త నిరాశే ఎదురవుతోంది. ఈ నెల 24న ఆమె పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టవలసి ఉండగా దానిని 27కి వాయిదా వేసింది. 

సుప్రీంకోర్టులో జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అజయ్ రస్తోగిల కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 27న ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. దీంతో మళ్ళీ కేసీఆర్‌ కుటుంబంలో, బిఆర్ఎస్ పార్టీలో ఆందోళన మొదలవడం సహజం. ఎందుకంటే ఆమెతో సహా వారందరూ ఈడీపై ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పటికీ, ఈ ఒక్క నెలలోనే ఆమెను 11,20,21 తేదీలలో మూడుసార్లు ఢిల్లీకి పిలిపించుకొని ప్రశ్నించారు. 

మళ్ళీ విచారణకు హాజరుకావాలని ఈడీ ఆమెను కోరనప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు ఆలస్యమైతే మరోసారి పిలిచి, అరెస్ట్ చేయవచ్చనే భయం వెంటాడుతూనే ఉంది. కనుక రేపు సుప్రీంకోర్టు ఆమె పిటిషన్‌పై విచారణ జరిపి సానుకూలంగా తీర్పు చెపుతుందని అందరూ ఆశగా ఎదురుచూస్తుంటే, రేపుకాదు... మార్చి 27న విచారణ చేపట్టాలని నిర్ణయించడంతో మళ్ళీ అందరిలో ఆందోళన మొదలవుతుంది. 

అయితే ఇకపై కల్వకుంట్ల కవితకు బదులు ఆమె న్యాయవాదులు హాజరయ్యేందుకు ఈడీ అనుమతించడం నిజమైతే సుప్రీంకోర్టు విచారణ ఆలస్యమైనా ఆమెకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు.


Related Post