నాందేడ్‌లో బిఆర్ఎస్‌ సభకి చురుకుగా ఏర్పాట్లు

February 03, 2023


img

బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తున్న సిఎం కేసీఆర్‌, తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం వెలుపల మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో ఈ నెల 5వ తేదీన బహిరంగసభ నిర్వహించబోతున్నారు. నాందేడ్‌ జిల్లా తెలంగాణలోని నిర్మల్ జిల్లాని ఆనుకొని ఉన్నందున రెండు జిల్లాల మద్య ప్రజల రాకపోకలు సాగుతుంటాయి. కనుక నాందేడ్‌ జిల్లా ప్రజలకి నిర్మల్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పధకాలని చూసి తమ గ్రామాలని తెలంగాణ రాష్ట్రంలో కలిపేయాలని ఆందోళనలు కూడా చేశారు. కనుక రాష్ట్రం వెలుపల బిఆర్ఎస్‌ తొలి బహిరంగసభ నిర్వహించడానికి నాందేడ్‌ అన్ని విదాల అనుకూలమైనదని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. 

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జోగు రామన్న తదితరులు ఇప్పటికే నాందేడ్‌లో పర్యటించి స్థానిక నేతలని బహిరంగసభకి ఆహ్వానించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో నాందేడ్‌లోని బోకర్ మండలం రాఠీ సర్పంచ్‌ మల్లేశ్ పటేల్‌తో సహా సుమారు వంద మంది బిఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సభని విజయవంతం చేసే బాధ్యత వారికీ అప్పగించారు.       

శుక్రవారం బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్ రెడ్డి, టిఎస్ఐసీసీ ఛైర్మన్ బాలామల్లు తదితరులు నాందేడ్‌లో సభావేదిక ఏర్పాట్లని పరిశీలించారు. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున ప్రజలని ఈ సభకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది రాష్ట్రం వెలుపల జరుగుతున్న తొలి బహిరంగసభ కనుక జాతీయస్థాయి నాయకులని కూడా ఆహ్వానించారు.


Related Post