ప్రగతి భవన్‌ మీద ఈడీ రెయిడ్ చేయాలి: షర్మిల

December 01, 2022


img

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసి తనపై కేసీఆర్‌ ప్రభుత్వం ఏవిదంగా దాడులకు పాల్పడుతుందో వివరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నా పాదయాత్రకు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేకనే కేసీఆర్‌ నామీద, నా అనుచరుల మీద తన పార్టీ నాయకులతో దాడులు చేయిస్తున్నారు. ఇంతకాలం స్పందించని టిఆర్ఎస్‌ నేతలందరూ నిన్నటి నుంచి ప్రెస్‌మీట్‌లు పెట్టి నన్ను బెదిరిస్తున్నారు. నల్లిని నలిపినట్లు నలిపేస్తామని టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెదిరిస్తే, నియోజకవర్గంలో అడుగుపెడితే నా అంతు చూస్తానని మరొకరు బెదిరిస్తున్నారు. 

నన్ను జైల్లో పెట్టించాలని టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో రేపటి నుంచి నేను పాదయాత్ర చేయబోతున్నానని గ్రహించి నన్ను అడ్డుకొనేందుకే ఇలా బెదిరింపులకి దిగుతున్నారు. అయితే టిఆర్ఎస్‌ గుండాల బెదిరింపులకి భయపడేది లేదు. తప్పకుండా పాదయాత్ర చేస్తా. నాకు ఏం జరిగినా అందుకు సిఎం కేసీఆరే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మిగులు బడ్జెట్‌తో ధనిక రాష్ట్రంగా చేతికి అందిన తెలంగాణని కేసీఆర్‌ కుటుంబం అప్పులకుప్పగా మార్చేశారు. కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి ప్రాజెక్టులలో వేల కోట్లు కమీషన్లు దండుకొంటుంటే ఆయన కుమారుడు కేటీఆర్‌ రాష్ట్రంలో భూములన్నీ కబ్జా చేస్తూ వేలకోట్లు విలువగల ల్యాండ్ బ్యాంక్ సంపాదించుకొన్నారు. ఇక కేసీఆర్‌ కుమార్తె మద్యం వ్యాపారాలలో కమీషన్లు సంపాదించుకొంటున్నారు. 

తెలంగాణ ఏర్పడితే ప్రజలకు ఓరిగిందేమీ లేదు కానీ కేసీఆర్‌ కుటుంబం మాత్రం బాగుపడింది. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని వేలకోట్లు పోగేసుకొంది. కేసీఆర్‌ దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు. ఈడీ, ఐ‌టి శాఖలు ఎక్కడో వెతకడం కాదు. కేసీఆర్‌ నివాసం ఉంటున్న ప్రగతి భవన్‌లో మొదట రైడ్ చేయాలి. కేసీఆర్‌ కొడుకు, కూతురు, బంధువుల ఇళ్ళపై రైడ్స్ చేయాలి. చేస్తే లక్షల కోట్లు పట్టుబడతాయి. కనుక వారి ఇళ్ళపై దాడులు చేయాలని నేను ఆ శాఖల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.


Related Post