తొలిసారిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత పేరు ఈడీ ప్రస్తావన!

December 01, 2022


img

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె, టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినబడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతకాలం బిజెపి నేతలు లేదా మీడియాలో వార్తలలో మాత్రమే ఆమె పేరు వినిపిస్తుండేది. కానీ ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న ఈడీ తొలిసారిగా ఆమె పేరుని ప్రస్తావించింది. ఈ కేసులో నిందితులలో ఒకరైన అమిత్‌ ఆరోడాని ఈడీ అధికారులు బుదవారం ఢిల్లీలోని ఈడీ కోర్టులో హాజరుపరుస్తూ రిమాండ్ రిపోర్టుని కోర్టుకి సమర్పించారు. 

దానిలో ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 36 మంది పేర్లను పేర్కొన్నారు. వారిలో కల్వకుంట్ల కవిత, ఆమె ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, వారికి సన్నిహితుడుగా చెప్పుకోబడుతున్న అభిషేక్ బోయినపల్లి, సృజన్ రెడ్డి, ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్రరెడ్డి తదితరుల పేర్లను రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. 

ఈ కుంభకోణం బయటపడగానే దీనిలో అనుమానితులుగా భావిస్తున్న వారందరూ తమకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలు దొరక్కుండా తప్పించుకొనేందుకు గత రెండేళ్లలో ఒక్కొక్కరూ కనీసం 3 నుంచి 14 మొబైల్ ఫోన్లు చొప్పున మొత్తం 170 ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. 

వారిలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియా అత్యధికంగా 14, అమిత్‌ ఆరోడా 11, కల్వకుంట్ల కవిత 10, శరత్ చంద్ర రెడ్డి 9, గోరంట్ల బుచ్చిబాబు 6, బోయినపల్లి అభిషేక్ 5, సృజన్ రెడ్డి 3 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లు గుర్తించామని ఈడీ పేర్కొంది. అయినప్పటికీ అతి కష్టం మీద 17 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని వాటిలో లభించిన ఆధారాలతో కీలకమైన సమాచారాన్ని సేకరించామని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అనుమానితుల కాల్ డేటా ఆధారంగా మరిన్ని కీలకమైన వివరాలను సేకరించినట్లు ఈడీ పేర్కొంది. 

ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఏమిటంటే, ఈ కేసులో 36 మంది నిందితులు చేతులు కలిపి, మద్యం తయారీ కంపెనీలకు, ఢిల్లీలోని మద్యం సిండికేట్లకు, కొందరు ఆమాద్మీ మంత్రులకు భారీగా ముడుపులు ముట్టేలా ఢిల్లీలోని ఆమాద్మీ ప్రభుత్వం మద్యం పాలసీని రూపొందించారని ఈడీ ఆరోపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కల్వకుంట్ల కవిత, శరత్ చంద్ర రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధ్వర్యంలో ఈ వ్యవహారామంతా నడిచిందని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.

దీనిలో ప్రధాన సూత్రధారి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కాగా ఆయన సాయంతో నిందితులు, కొందరు అధికారులు కలిసి లోపభూయిష్టమైన మద్యం పాలసీని తయారు చేయించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. దీని వలన ఢిల్లీ ప్రభుత్వానికి రూ.581 కోట్లు ఆదాయం కోల్పోవడమే కాక లైసెన్స్ ఫీజుల రూపేణా రావలసిన రూ.2,873 కోట్లు ఆదాయాన్ని కూడా కోల్పోయిందని ఈడీ పేర్కొంది. 

ఈ కుంభకోణంలో ఇప్పటికే ఆమాద్మీ నేతలకు రూ.100 కోట్లు ముడుపులు ముట్టజెప్పినట్లు ఈడీ రిపోర్టులో పేర్కొంది. ఈడీ అభ్యర్ధన మేరకు ఈడీ కోర్టు అమిత్‌ ఆరోడాని విచారించేందుకు డిసెంబర్‌ 7వరకు కస్టడీకి అనుమతించింది. 


Related Post