ఆదాయం కోసం కాదు.. ప్రజల భద్రత కోసమే జరిమానాలు: ట్రాఫిక్ పోలీస్

November 22, 2022


img

ఈ నెల 28వ తేదీ నుంచి హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాధ్ చెప్పారు. రాంగ్ రూట్‌లో వచ్చే వాహనాలకు రూ.1,700, ట్రిపుల్ రైడింగ్ చేసే ద్విచక్రవాహనదారులకి రూ.1,200 వరకు జరిమానాలు విడించబోతున్నట్లు తెలిపారు. ఇప్పుడు పట్టుబడే వాహనాలపై గతంలో ఏవైనా పెండింగ్ చలాన్లు ఉన్నాయా లేవా?అని కూడా పరిశీలించి, ఉన్నట్లయితే వాటిని వసూలు చేస్తామని చెప్పారు. అలాగే ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేసినా భారీగా జరిమానాలు విధిస్తామని తెలిపారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే కొన్ని భారీ వాహనాలకు ఈ జరిమానాలు మరింత భారీగా ఉంటాయని తెలిపారు.

 నగరంలో కొన్ని చోట్ల వాహనాలు రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తుండటం, ట్రిపుల్ రైడింగ్ వలననే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయని, కనుక వాటిని కట్టడి చేసి ప్రజలకు భద్రత కల్పించేందుకే ఈ జరిమానాలు విధిస్తున్నాము తప్ప ఆదాయం కోసం కాదని రంగనాధ్ తెలిపారు. కానీ సోషల్ మీడియాలో కొందరు ఆదాయం కోసమే తమశాఖ జరిమానాలు విధిస్తోందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం సరిపడినన్ని నిధులు మంజూరు చేస్తోందని కనుక ఆదాయం కోసం జరిమానాలు విధించాల్సిన అవసరం లేదని, వాహనదారులు ట్రాఫిక్ నిబందనలకు కట్టుబడి ఉంచేలా చేసి ప్రజలకు మరింత భద్రత కల్పించడం కోసమే ఈ ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. కనుక నగరంలోని వాహనదారులందరూ ట్రాఫిక్ నియమనిబందనలను ఖచ్చితంగా పాటించాలని రంగనాధ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.


Related Post