ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, అయన కుమారుడు నారా లోకేష్, ఏపి సర్కార్ పై జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న తీవ్ర విమర్శలపై హిందూపురం తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. శనివారం అనంతపురంలో జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైనప్పుడు విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా, “తెదేపాకు ఒకటే అజెండా. అది అభివృద్ధి. కానీ కొంతమంది నోటికివచ్చినట్లు విమర్శలు చేస్తుంటారు. అటువంటి వారిని మేము పట్టించుకోము. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి అతన్ని హీరో చేయడం మాకిష్టం లేదు. ఇప్పటికీ, ఎప్పటికీ మేమే అసలైన హీరోలం,” అని అన్నారు.
పవన్ కళ్యాణ్ అడుగుతున్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఏ ఒక్కరూ నేరుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయకుండా, తిరిగి అయనపై ఎదురుదాడి చేసి, భాజపా ముద్ర వేసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి బాలకృష్ణ మాట్లాడకపోయినా అయన హీరోయే. కనుక పవన్ కళ్యాణ్ ను ఎవరూ కొత్తగా హీరో చేయనక్కరలేదు. అలాగే ఎప్పటికీ మేమే హీరోలమని బాలయ్య చెప్పుకోవడం కూడా అనవసరమే. పవన్ కళ్యాణ్ తన కెరీర్ పీక్ స్టేజిలో ఉండగా దానిని వదిలేసి ప్రజల కోసం ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చారు. కానీ బాలయ్య నేటికీ సినిమాలు చేసుకొంటూ పార్ట్-టైం రాజకీయాలు చేస్తున్నారు. కనుక రియల్ లైఫ్ హీరో పవన్ కళ్యాణ్ అనే చెప్పక తప్పదు.