వేసవి సెలవులు నిన్నటితో ముగియడంతో నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకున్నాయి. కనుక మళ్ళీ పాఠశాలలన్నీ విద్యార్ధులతో కళకళలాడుతున్నాయి.
రాష్ట్రంలో పలు జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలలను అందంగా పూలతో అలంకరించి బాజా భజంత్రీలతో ఉపాద్యాయులు విద్యార్ధులకు స్వాగతం పలుకుతుండటంతో పండుగ వాతావరణం నెలకొని ఉంది.
ఉపాధ్యాయులు పిల్లలకు పూలు, పళ్ళు, మితాయిలు పంచి ఆప్యాయంగా ఆహ్వానం పలుకుతుండటంతో విద్యార్ధులు చాలా సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో కలిసి సుమారు 62 లక్షల మంది విద్యార్ధులున్నారు. అందరూ ఒకేసారి పాఠశాలలకు బయలుదేరడంతో మళ్ళీ ఆర్టీసీ బస్సులు, స్కూలు బాసులు, ఆటోలు, షేరింగ్ ఆటోలు విద్యార్ధులతో కిటకిటలాడాయి.
కానీ వర్షాకాలం మొదలవడంతో తరచూ హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కూరుస్తుండటంతో విద్యార్ధులు, వారి తల్లి తండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.