గ్రూప్-1లో 563 పోస్టుల భర్తీకి జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ నిర్వహించబోతున్నట్లు టిఎస్‌పీఎస్సీ ప్రకటించింది. దీంతో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి మొదలవుతోంది. ఈ ఉద్యోగాల కోసం ఈనెల 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తులతో పాటు అభ్యర్ధులు రూ.320 ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది.
నిరుద్యోగులు, ప్రభుత్వోద్యోగులు ఈ ఫీజు చెల్లించనవసరం లేదు. అలాగే 2022లో గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్నవారు మళ్ళీ దరఖాస్తు చేసుకోనవసరం లేదు. ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. మే-జూన్ నెలల్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్-అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి.
గత ప్రభుత్వ హయాంలో 503 పోస్టుల భర్తీకి టిఎస్‌పీఎస్సీ 2022లో నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత పరీక్షలకు ముందే ప్రశ్నాపత్రాల లీక్ అవడం, ఆ కారణంగా పరీక్షల రద్దు వగైరా వ్యవహారాల గురించి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా అధికరంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 503 పోస్టులకు మరో 60 పోస్టులను మంజూరు చేసి, పాత నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ జారీ చేసి గ్రూప్-1 పోస్టుల 563 భర్తీ ప్రక్రియని ప్రారంభించింది. ఈసారి ఎటువంటి అవకతవకలు జరుగకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసి వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెపుతోంది.
గ్రూప్-1లో తాజాగా మంజూరు చేసిన 60 పోస్టులలో డీఎస్పీ-24, ఎంపీడీవో-19, అసెస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్-4, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్-3, జిల్లా ఉపాధి కల్పన అధికారి: 3, డెప్యూటీ కలెక్టర్-3, జిల్లా పంచాయితీ అధికారి-2, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-1, జిల్లా రిజిస్ట్రార్-1 పోస్టు ఉన్నాయి.
తాజా నోటిఫికేషన్‌లో ఉద్యోగాలకు వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపులు ఉంటాయి. దివ్యాంగులకు 10 సం.లు, ప్రభుత్వోద్యోగులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు 5 సం.లు, మాజీ సైనికోద్యోగులకు, ఎన్‌సీసీ అభ్యర్ధులకు 3 సం.లు వయో సడలింపు ఉంటుంది. దీనికి సంబందించి పూర్తి వివరాల కోసం టిఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.