ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ అధ్వర్యంలో అనేక అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా జరిగాయి. ఇంకా అనేకం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంత కీలక పదవిలో ఉన్నప్పటికీ ఆయనలో ఇంకా చదువుకోవాలనే విద్యాకాంక్ష తీరలేదు.
ప్రస్తుతం ఆయన వయసు 60 ఏళ్ళు. ఈ వయసులో ఆయన మద్రాస్ ఐఐటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఈరోజు మద్రాస్ ఐఐటి 61వ స్నాతకోత్సవంలో ఆయన స్వయంగా పాల్గొని డాక్టరేట్ డిగ్రీ అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నేను చిన్నప్పటి నుంచి స్కూల్ టాపర్. అయినప్పటికీ ఐఐటి ప్రవేశ పరీక్షకు హాజరుకావాలంటే భయం ఉండేది. ఆ తర్వాత బెంగళూరులో మాస్టర్స్ డిగ్రీ చేశాను కానీ మద్రాస్ ఐఐటిలో చదువుకొని సర్టిఫికేట్ పొందాలనే నా కోరిక అలాగే ఉండిపోవడంతో, ఎట్టకేలకు పీహెచ్‌డీ పూర్తిచేసి డాక్టరేట్ సర్టిఫికేట్ అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.
కేరళలో జన్మించిన సోమనాధ్ కొల్లంలోని ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సస్‌లో ఏరో స్పేస్ ఇంజనీరింగ్ మాస్టర్స్ చేశారు. విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్లో డైరెక్టరుగా చేశారు. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ, భారత్‌కు గర్వకారణమైన అనేక గొప్ప గొప్ప అంతరిక్ష ప్రయోగాలు చేయిస్తున్నారు.