ఇంజనీరింగ్, మెడికల్ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్దులు ఉద్యోగాలు పొందలేక ఇబ్బందులు పడుతుంటారు. కారణం వారికి సంబందిత రంగంలో అవసరమైన నైపుణ్యాలు లేకపోవడమే. అందుకే నాలుగేళ్ళు ఇంజనీరింగ్ చేసినప్పటికీ మళ్ళీ తప్పనిసరిగా ఏదో ఓ సాఫ్ట్‌వేర్ కోర్సు చేయవలసివస్తోంది.
అలాగే స్టీల్ ప్లాంట్, ఫార్మా వంటి వేలాది రకాల పరిశ్రమలున్నాయి. వాటిలో ఉద్యోగాలు సంపాదించాలంటే ఆయా రంగాలలో నైపుణ్యం కలిగి ఉండాలి.
బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఏరో స్పేస్, రీటైల్ అండ్ హోల్ సేల్ మార్కెట్, మార్కెటింగ్, సినీ పరిశ్రమ, గ్రాఫిక్స్, విజువల్స్ ఇలా ప్రతీ రంగానికి వేర్వేరు వృత్తి నైపుణ్యాలు అవసరం. కానీ మన కాలేజీలు, యూనివర్సిటీలలో వాటి బేసిక్స్ మాత్రమే నేర్పించి బయటకు పంపిస్తుంటారు.
కనుక వివిద రంగాలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన అభ్యర్ధులను తయారు చేసేందుకుగాను సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సంబందిత శాఖల ఉన్నతాధికారులు ఇప్పటికే ఢిల్లీ, హర్యానాలో ఉన్న స్కిల్ యూనివర్సిటీలను పరిశీలించి, తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏవిదంగా ఉండాలో ఓ ముసాయిదా నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించారు. దాని ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం శాసనసభ సమావేశాలలో స్కిల్ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయబోతోంది. బడ్జెట్‌లో దానికి అవసరమైన నిధులు కేటాయించగానే రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తొలుత ఉద్యోగ, ఉపాడి అవకాశాలున్న రంగాలకు సంబందించి కోర్సులు ప్రవేశపెడతామని చెప్పారు. తొలి ఏడాది 2,000 మందితో ప్రారంభించి క్రమంగా 20,000 మందికి పెంచుతామని చెప్పారు.